నమస్తే తెలంగాణ నెట్వర్క్ , జూన్ 13 : ఉమ్మడి వరంగల్‌తోపాటు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలంలో శనివారం సాయంత్రం గాలివానకు సిర్పూర్(టీ)-కాగజ్‌నగర్ ప్రధాన రహదారిలో ఐదు కిలోమీటర్ల మేర పదుల సంఖ్యలో విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. కొన్ని గంటలపాటు రాకపోకలు స్తంభించాయి. సిర్పూర్(టీ) మండల కేంద్రంలోని బెస్తవాడ కాలనీలో భారీ చెట్టు కూలడంతో ఓ ఇల్లు ధ్వంసమైంది.
గోల్లవాడ కాలనీ సమీపంలో ఓ ఇంటిపై ఉన్న రేకులు గాలికి లేచిపోయాయి. రోడ్లపై భారీ చెట్లు విరిగిపడ్డాయి. కాగా వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురం, కేశవాపురం గ్రామాల్లో ఈదురుగాలులకు 10 ఎకరాల్లో అరటి తోట నేల వాలిందని బాధిత రైతులు వాపోయారు. వర్ధన్నపేట పట్టణంలోని ఎస్సీ కాలనీతోపాటు కోనాపురం, గుబ్బెటితండాల్లో పలువురి ఇండ్ల పైకప్పులు గాలికి లేచిపోయాయి. మామిడి తోటలో కాయలు రాలిపోవడంతో రైతులు నష్టపోయారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లి, కంఠాయాపాలెం గ్రామాల్లో సుమారు 70 ఇండ్లు దెబ్బతిన్నట్టు స్థానికులు తెలిపారు.