హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్, జగిత్యాల, ములుగు, భద్రాద్రి-కొత్తగూ డెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్కర్నూల్, వనపర్తి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. సోమవారం ఉపరితల ఆవర్తనం నైరుతి, దాని పరిసరాల్లోని ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతుందని వివరించింది.