Heavy Rains | ఉపరితల ద్రోణిప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు మండిపోయినప్పటికీ.. మధ్యాహ్నానికి వాతావరణం చల్లబడింది. రాష్ట్రవ్యాప్తంగా మబ్బులు కమ్ముకొని ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. మధ్యాహ్నమే కాకుండా గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు కూడా భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్ పద్మారావునగర్‌లో విద్యుత్ తీగలు తెగిపడటంతో వాకింగ్ చేస్తున్న ప్రదీప్ అనే వ్యక్తి దుర్మరణం చెందాడు.
Ice Cube Rain
పశ్చిమబెంగాల్, ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి, దక్షిణ తమిళనాడు నుంచి మధ్య, అంతర్గత కర్ణాటక, గోవా మీదుగా ఉత్తర కొంకణ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది.. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు పలుచోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది. రేపు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, జనగాం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Hailstorm
సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో రాళ్ల వాన దంచికొట్టింది. పంటలు నేల మట్టమవగా, చెట్లు విరిగిపడ్డాయి. వికారాబాద్ జిల్లా మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లో వడగండ్లు పడ్డాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్, మునిపల్లి మండలాల్లో వడగండ్లు పడ్డాయి. న్యాల్కల్ మండలంలో పంటలు దెబ్బతిన్నాయి. గద్వాల మార్కెట్లో ధాన్యం తడిసిపోయింది. మానవపాడు మండలంలో మిర్చి తడిసిపోయింది. బిజినేపల్లి మండలం లింగసానిపల్లి శివారులో గొర్రెల కాపరి బాలకృష్ణ(22), పెబ్బేరు మండలం పెంచికలపాడు శివారులో వనపర్తి మండలం చిట్యాలకు చెందిన వంగూరు లక్ష్మి (50), గట్టు మండలం ఆరగిద్ద శివారులో చాకలి జంబన్న పిడుగుపాటుకు గురై మృతి చెందారు.
కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో చిరుజల్లులు, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం కురిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. నల్లగొండ పట్టణంతోపాటు కనగల్‌లో 4 సెంటీమీటర్ల వర్షం పడగా మిర్యాలగూడ, నాంపల్లి, మర్రిగూడ, పీఏ పల్లి అనుముల మండలాల్లో 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మిర్యాలగూడలోని గంట శ్రవణ్‌రెడ్డి ఇంటిపై పిడుగు పడటంతో ఇంట్లోని 9 లక్షల విలువైన సామగ్రి కాలి బూడిదయ్యింది.