Hyderabad Rains : హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, అల్విన్ కాలనీ, చందానగర్, పటాన్ చెరు, అమీన్పూర్, ఇస్నాపూర్, బీరంగూడ, బీహెచ్ఈఎల్, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ తదితర ప్రాంతాల్లో గురువారం వర్షాలు దంచికొట్టాయి. ఇవాళ (ఆగస్టు 16) కూడా నగరంలోని చాలా ప్రాంతాల్లో సాయంత్రం నుంచి కుండపోత వర్షం పడుతోంది.
కూకట్పల్లి, మూసాపేట్, కేపీహెచ్‌బీ కాలనీ, ఆల్విన్‌కాలనీ, హైదర్‌నగర్‌లో భారీ వర్షం కురుస్తోందని.. పటాన్చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్, అమీర్‌పేట, వెంగళరావు నగర్, యూసఫ్‌గూడ, ఐడీఏ బొల్లారం, గుమ్మడిదలలో అతి భారీ వర్షాలు పడుతున్నాయని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. రానున్న రెండు మూడు రోజులపాటు నగరవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దాంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని అధికారులు సూచిస్తున్నారు.
భారీ వర్షాలతో చాదర్ ఘాట్, మలక్ పేటలలో వరద నీరు నిలిచింది. చాదర్ ఘాట్ నుంచి మలక్ పేట, దిల్సుఖ్నగర్ వెళ్లే మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఐటీ కారిడర్ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ స్తంభించిందని పోలీసులు తెలిపారు. రాత్రి వరకు నిరంతరాయంగా వర్షం కురుస్తోందని, నగర పౌరులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. నగరంలో హై అలర్ట్ జారీచేశారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని హెచ్చరించారు.
ఏదైనా అనుకోని విపత్తు సంభవిస్తే వెంటనే 040-21111111, 9000113667 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. కాగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.