హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని వరుణుడు వణికిస్తున్నాడు. గత రెండురోజులుగా ఎడతెరపిలేని వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లడంతోపాటు పలు జిల్లాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. రుతుపవన ద్రోణి, ఉపరితల ఆవర్తనానికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 24గంటల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అత్యంత అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది.
ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు వెల్లడించింది. 19జిల్లాలకు ఆరెంజ్, మరో 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు తెలిపింది.