Rain Alert | హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆయా జిల్లాలకు రెడ్, ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావొద్దని సూచించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారవచ్చని తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం వరకు మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొన్నది.
పలు చోట్ల భారీ వర్షం
హైదరాబాద్ నగరంతో పాటు ఉమ్మడి ఖమ్మం, మేడ్చల్ మల్కాజిగిరి తదితర జిల్లాల్లో సోమవారం సాయంత్రం నుంచే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈదురు గాలులతో కొన్ని చోట్ల చెట్లు కూలగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌లో నాలుగో అంతస్థు నుంచి రేకులు పడి, ఫరీద్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.