హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. సోమవారం సాయంత్రం పూరీ వద్ద తీరం దాటిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ దిశగా పయనించి క్రమంగా బలహీనపడుతుందని ఐఎండీ పేరొన్నది. రాష్ట్రంలో రాగల మూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఈ నెల 15 వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌ని జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో ములుగు, జయశంకర్భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 12 వరకూ మత్స్యకారులు సమద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. అల్లూరి జిల్లా జీకే వీధి మండలం చట్రాయిపల్లి వద్ద కొండచరియలు విరిగిపడి ఒకరు మృతిచెందగా.. ముగ్గురు గల్లంతైనట్టు తెలుస్తోంది. శిథిలాల కింద చికుకున్న నలుగురిని అధికారులు రక్షించారు. గడిచిన 24గంటల్లో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో గరిష్ఠ వర్షపాతం 6.41 సెంటీమీటర్లు నమోదైనట్లు వాతావారణ శాఖ అధికారులు ప్రకటించారు.
వర్షాల ఎఫెక్ట్.. 2,300కి.మీ రోడ్లు ధ్వంసం
భారీ వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో సుమారు 2,300 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం కాగా, పునరుద్ధరణకు సుమారు రూ. 2వేల కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా రోడ్లు దెబ్బతినగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యధికంగా నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ముంపునకు గురైన 700 ప్రాంతాల్లో రోడ్లపై కంకర తేలగా, దాదాపు 100ప్రాంతాల్లో వరదలతో రోడ్లు కొట్టుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం రేపు రాష్ర్టానికి రానున్నది.