హైదరాబాద్ : రాష్ట్రం పలు జిల్లాల్లో మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, పలుజిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
హైదరాబాద్‌లో ఇవాళ సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు, కొన్నిచోట్ల జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పింది. గరిష్ఠంగా 30 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందని వివరించింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
మరో వైపు రాబోయే వారం రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఇవాళ నల్లగొండ, ఖమ్మం జిల్లాలలో మోస్తరు వర్షాపాతం నమోదైంది. పలుజిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.