హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగామ, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షం కురిసినట్టు పేర్కొన్నది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో అత్యధికంగా 6.28 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. వచ్చే నాలుగు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని అంచనా వేసినట్టు వెల్లడించింది. శుక్ర, శని, ఆదివారాల్లో పలు జి ల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్టు వెల్లడించింది.