నర్సంపేట, ఏప్రిల్ 9: వరంగల్ జిల్లా నర్సంపేటలో మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం అన్నదాతను దెబ్బతీసింది. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన మక్కలు కొట్టుకుపోయాయి. పెద్ద మొత్తంలో పంట తడిసిపోవడంతో రైతులు లబోదిబోమన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో చేతికొచ్చిన మక్కజొన్న, వరి పంటలు నేలకొరిగాయి. మామిడి కాయలు నేలరాలడంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. మహేశ్వరం, లక్నేపల్లి గ్రామ శివారు నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారి, నర్సంపేట-మల్లంపల్లి ప్రధాన రహదారుల్లో ఈదురు గాలులకు పెద్దపెద్ద చెట్లు విరిగిపడ్డాయి.