జగదేవ్పూర్, మద్దూరు (ధూళిమిట్ట), హుస్నాబాద్ టౌన్, మహ్మదాబాద్, ఏప్రిల్ 21: సిద్దిపేట సహా పలు జిల్లాల్లో సోమవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లాలోని జగదేవ్పూర్, ధూళిమిట్ల, హుస్నాబాద్ మండలాల్లో భారీ నష్టం జరిగింది. జగదేవ్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని చెట్లు విరిగిపడ్డాయి. మండలంలోని పీర్లపల్లి, ధర్మారం, గొల్లపల్లి, అలిరాజ్పేట, నిర్మల్నగర్, దౌలాపూర్ గ్రామాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించడంతో చేతికొచ్చిన వరి ధాన్యం నేలరాలింది. మామిడి కాయలు రాలిపోయాయి. విద్యుత్ వైర్లు తెగిపడటంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ధూళిమిట్ట మండలవ్యాప్తంగా వడ్లు, మామిడికాయలు నేలరాలాయి. చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి.
ధూళిమిట్టకు చెందిన జెల్ల స్వరూప, కమ్మరి లక్ష్మీనారాయణలకు చెందిన రేకుల ఇంటి పైకప్పులు లేచిపోయాయి. ధూళిమిట్టలో తడిసిన ధాన్యాన్ని తహసీల్దార్ సింహాచలం మధుసూదన్ పరిశీలించారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం తడిసింది. తడిసిన ధాన్యాన్ని బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున్రెడ్డి మాట్లాడుతూ.. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలంలో కురిసిన వానతో ధాన్యం తడిసింది. మండలంలోని వెంకట్పల్లి, మహ్మదాబాద్ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న దాదాపు 600 బస్తాల ధాన్యం తడిసి ముద్దయింది.