Green Field Survey | ఆమనగల్లు, జనవరి 6: గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు రెండో విడత భూసేకరణ కోసం భారీ పోలీసు బందోబస్తు మధ్య సోమవారం మార్కింగ్ చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఫోర్త్ సిటీని కలుపుతూ నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు భూసేకరణకు ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మీర్ఖాన్పేట నుంచి కుర్మిద్ద, కడ్తాల్, ముద్విన్, ఆమనగల్లు మీదు గా ఆకుతోటపల్లి వరకు సుమారు 21కి.మీ మేర 330 అడుగుల వెడల్పు రహదారి నిర్మాణానికి 554 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే సోమవారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల పరిధిలోని ఆకుతోటపల్లి శివారులో ప్రభుత్వం గుర్తించిన భూ మికి రెవెన్యూ అధికారులు మార్కింగ్ ఇచ్చారు. ఆ ప్రాంతంలో షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి, ఆమనగల్లు సీఐ ప్రమోద్ కుమార్, ఎస్సై వెంకటేశ్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఖైరతాబాద్, జనవరి 6 : ఎస్సీలోని ఉప కులాలకు న్యాయం చేసేందుకే 30 ఏండ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్నామని, వర్గీకరణను వ్యతిరేకించేవారిపై తమ పోరాటం ఆగదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టంచేశారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా బీసీ నాయకులు, నిరుద్యోగ, కళాకారుల ఆధ్వర్యంలో సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వర్గీకరణ పోరాటం ఎవరికీ వ్యతిరేకం కాదని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిగా వర్గీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ అంశాన్ని ఆలస్యం చేస్తుందని విమర్శించారు. వర్గీకరణ సాధించుకున్నా.. రాష్ట్రంలో అమలుచేయకపోవడంపై ఆవేదన వ్యక్తంచేశారు. వర్గీకరణకు బీసీల మద్దతు హర్షణీయమన్నారు.