నమస్తే నెట్వర్క్, ఆగస్టు 16 : కృష్ణా, తుంగభద్ర నదులకు వరద తగ్గుముఖం పట్టింది. శనివారం జూరాలకు 95 వేల క్యూసెక్కులు వస్తుండగా.. డ్యాం 6 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అవుట్‌ఫ్లో 80,374 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యాం పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.184 టీఎంసీలు నిల్వ ఉన్నది. శ్రీశైలం జలాశయం 5 గేట్ల ద్వారా 1,33,720 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 1,89,169 క్యూసెక్కులుగా, అవుట్‌ఫ్లో 1,99,544 క్యూసెక్కులుగా న మోదైంది. నాగార్జునసాగర్‌కు వరద పెరుగుతుండటం తో శనివారం సాయంత్రం 20 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు 1,99,544 క్యూసెక్కుల వరద వస్తుండగా, 1,95,450 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది. సాగర్ పూర్తి నీటి సామర్థ్యం 590 అడుగులకు గాను 587.50 అడుగులకు చేరుకొన్నది.
ఎస్సారెస్పీకి భారీగా ఇన్‌ఫ్లో..
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతున్నది. శనివారం 1.04 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా, ప్రస్తుతం 1,083 అడుగుల నీరు నిల్వ ఉన్నది. కాగా నిజాంసాగర్ ప్రాజెక్టుకు 31,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,405 అడుగులు కాగా, శనివారం 1,397.66 అడుగుల నీరు నిల్వ ఉన్నది. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎగువన కడెం ప్రాజెక్టునుంచి 20 గేట్లు తెరిచి 66,807 క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని లక్ష్మీ (మేడిగడ్డ) బరాజ్‌కు 3,10,080 క్యూసెక్కుల వరద వస్తున్నది. బరాజ్‌లోని మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం 5.6 మీటర్ల ఎత్తులో ఉన్నదని అధికారులు తెలిపారు.