తిమ్మాపూర్, ఆగస్టు28 : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో లోయర్ మానేరు జలాశయానికి (Maneru reservoir)భారీగా వరద వస్తున్నది. ఇటు మోయ తుమ్మెద వాగుతో పాటు పైనున్న శ్రీ రాజరాజేశ్వర (మిడ్ మానేరు) రిజర్వాయర్ నుండి గేట్ల ద్వారా ఇన్ఫ్లో వస్తుండగా గంట గంటకు నీటిమట్టం పెరిగిపోతున్నది. ఈ క్రమంలో ఇదే వరద కొనసాగితే శుక్రవారం సాయంత్రం వరకు ఎల్ఎండీ రిజర్వాయర్ నుండి గేట్ల ద్వారా నీటిని కిందికి మానేరు వాగుకు విడుదల చేసే అవకాశం ఉంటుంది.
24 టీఎంసీల సామర్థం ఉన్న ఎల్ఎండీలో 15 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు పది టీఎంసీల లోపే ఉన్న నీళ్లు.. ఒక్కరోజులోనే అమాంతం పెరిగింది. ప్రస్తుతం లోయర్ మానేరు డ్యామ్ లోకి మోయ తుమ్మెద వాగు నుండి 27 వేల పైచిలుకు క్యూసెక్కుల నీళ్లు, మిడ్ మానేరు నుండి 45 వేల పై చిలుకు క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది. ఎల్ఎండీ పరివాహక ప్రాంత రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.