హైదరాబాద్ సిటీబ్యూరో/ సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 27( నమస్తే తెలంగాణ ): మూసీ వరద ఉధృతికి మహానగర రవాణా వ్యవస్థ ఒక్కసారిగా స్తంభించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (ఎంజీబీఎస్)లోకి భారీగా వరద నీరు చేరింది. ఫలితంగా బస్సులు కదలలేక, ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులు ఎటూ కదలలేని పరిస్థితి నెలకొన్నది. పండుగకు ఊరెళ్లాలనుకుని కుటుంబ సమేతంగా వచ్చిన ప్రయాణికులకు ఊహించని వరద చేదు అనుభవాన్ని మిగిల్చింది. వరద చుట్టుముట్టడంతో బస్సుల రాకపోకలను ఆర్టీసీ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఎంజీబీఎస్ నుంచి బయలుదేరే బస్సులను నగరంలోని ఇతర ప్రాంతాల నుండి నడిపిస్తున్నట్టు ప్రకటించారు. బస్టాండ్‌లో చిక్కుకున్న ప్రయాణికులను తాడ్ల సాయంతో వరద నీటిని దాటుకొని బయటకు తరలించారు. 30 ఏళ్ళ అనంతరం ఇంతటి భారీ వరద వచ్చిందని ఆర్టీసీ అధికారులు చెప్పారు.
ఎంజీబీఎస్‌కు ఎవరూ రావొద్దు!
వరద దృష్ట్యా ఎంజీబీస్‌కు ప్రయాణికులు ఎవరూ రావద్దని రంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీలత విజ్ఞప్తి చేశారు. అదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపు వెళ్లే బస్సులను జేబీఎస్ నుంచి, వరంగల్, హన్మకొండ వైపు వెళ్లే బస్సులను ఉప్పల్ క్రాస్‌రోడ్ నుంచి, సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ వైపు వెళ్లే బస్సులను ఎల్బీనగర్ నుంచి, మహబూబ్‌నగర్, కర్నూలు, బెంగళూరు వైపు బస్సులను ఆరంఘర్ నుంచి ప్రత్యేక పాయింట్ల ద్వారా నడపనున్నట్టు ఆమె పేర్కొన్నారు. రిటైనింగ్ వాల్ డ్యామేజీ కావడంతో వరద నీరు భారీగా ఎంజీబీస్ బస్టాండ్‌లోనికి చేరిందని ఆమె తెలిపారు.