న్యూఢిల్లీ, ఆగస్టు 3: వేగం పరిమితులపై(స్పీడ్ లిమిట్స్) స్పష్టత, రోడ్డు భద్రత కోసం కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ మోటారు వాహనాల చట్టానికి కొత్త సవరణలను ప్రతిపాదించింది. స్పీడ్ లిమిట్స్‌పై స్పష్టమైన అధికారం ఎవరి పరిధిలో ఉంటుందన్న విషయాన్ని ఈ మార్పులు ఖరారు చేస్తాయి. కాగా, జాతీయ రహదారులు(నేషనల్ హైవేలు), ఎక్స్‌ప్రెస్‌వేలపై స్పీడ్ లిమిట్స్‌కి కేంద్రం బాధ్యత వహిస్తుండగా రాష్ట్ర హైవేలు, స్థానిక రహదారులపై స్పీడ్ లిమిట్స్‌ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి.
ప్రస్తుతం కేంద్రం నిర్దేశించే స్పీడ్ లిమిట్స్‌కి, వేర్వేరు రాష్ర్టాలు నిర్దేశించే స్పీడ్ లిమిట్స్‌కి పొంతన ఉండడం లేదు. ఆ అసమానత కారణంగా తరచు డ్రైవర్లలో గందరగోళం ఏర్పడి జాతీయ మార్గదర్శకాలను పాటించాల్సిన హైవేలపై రాష్ట్రం విధించే స్పీడ్ లిమిట్స్‌ని పాటించి అనాలోచితంగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. కాగా, ప్రతిపాదిత సవరణల ద్వారా స్పీడ్ లిమిట్స్‌ని ప్రామాణీకరించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దీని వల్ల డ్రైవర్లపై జరిమానాల భారం తగ్గించి ట్రాఫిక్ నిర్వహణా యంత్రాంగంలో అవినీతికి ఆస్కారం లేకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.