హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం కనపడుతున్నదని, దీంతో మంగళవారం 20 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 42.2 డిగ్రీలు నమోదు కాగా, జగిత్యాలలో 42, మంచిర్యాలలో 41.8, ఖమ్మంలో 41.7, సూర్యాపేటలో 41.7, జయశంకర్ భూపాలపల్లి 41.6, మహబూబాబాద్ 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసినట్టు పేర్కొన్నది.
రాబోయే నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లోని కొన్ని ప్రాంతాల్లో విస్తరిస్తాయని వివరించింది. తూర్పు ఉత్తర్ప్రదేశ్, తెలంగాణ, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. దీని కారణంగా బుధ,గురువారాల్లో ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.