హైదరాబాద్, జూన్17 (నమస్తే తెలంగాణ) : వానకాలం ప్రారంభమై రెండు వారాలు దాటినా.. రాష్ట్రంలో వడగాల్పులు తగ్గడం లేదు. గురువారం దాదాపు 25 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా సూర్యాపేట జిల్లా మోతేలో 43.6 డిగ్రీలు, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం 43.5, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో 43.3, మంచిర్యాల జిల్లా జెన్నారంలో 43.3, నల్లగొండ జిల్లా కొత్తపల్లిలో 43.3, భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 43.2, హనుమకొండ జిల్లా ధర్మసాగర్లో 43.2, పెద్దపల్లి జిల్లా అంతర్ గాంలో 43.1, నిజామాబాద్ జిల్లా బోధన్‌లో 43 డిగ్రీల చొప్పున అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలి పారు. రెండు రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పులు ఉండవని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించినా ఎల్‌నినో కారణంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపారు. గురువారం ఆదిలాబాద్, కుమ్రం భీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వడగాల్పులు ఉంటాయని, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాలలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించారు. జూన్ 23 నుంచి నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.