Liver Cancer | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ ) : సంక్లిష్టమైన కాలేయ శస్త్రచికిత్సల కోసం కార్పొరేట్ దవాఖాలను ఆశ్రయించినా ఫలితం లేక ప్రాణాలపై ఆశలు వదిలేసుకుంటున్న ఎంతో మంది రోగులను ఉస్మానియా దవాఖాన వైద్యులు అక్కున చేర్చుకుని భరోసా కల్పిస్తున్నారు. అరుదైన కాలేయ వ్యాధులతో బాధపడే రోగులకు, ముఖ్యంగా చిన్నారులకు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. నిత్యం వందలాదిగా వచ్చే రోగులతో పని ఒత్తిడి పెరిగినప్పటికీ లెక్కచేయకుండా గంటల తరబడి సమయం వెచ్చించి అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగడం వల్లనే ఇది సాధ్యమవుతున్నదని ఉస్మానియా వైద్యులు చెప్తున్నారు.
అవయవ మార్పిడి శస్త్రచికిత్సల్లో గుండె మార్పిడి తర్వాత అత్యంత ఖరీదైనది కాలేయ మార్పిడే. రోగి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ఈ శస్త్రచికిత్సకు కార్పొరేట్ దవాఖానలో రూ.30 లక్షల నుంచి రూ.40లక్షల వరకు ఖర్చవుతుంది. దీనితోపాటు ఇతర కాలేయ శస్త్రచికిత్సలు, వాటికి అవసరమయ్యే మందులు సైతం ఖరీదైనవే. అంత ఖర్చును భరించే ఆర్థిక స్థోమత లేక ఎంతో మంది రోగులు తమ ఆస్తులను అమ్ముకుని రోడ్డు పాలవుతుంటే.. ఆస్తులు లేని రోగులు ఏకంగా ప్రాణాలనే కోల్పోతున్నారు. అలాంటివారి దైన్యస్థితికి చలించి గతంలో కేసీఆర్ ప్రభుత్వం అవయవ మార్పిడి శస్త్రచికిత్సలతోపాటు ఇతర ఖరీదైన చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో ఏటా వేలమంది నిరుపేద రోగులు పూర్తి ఉచితంగా ఆ శస్త్రచికిత్సలను చేయించుకుంటున్నారు. అందులో భాగంగా 2015వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఒక్క ఉస్మానియా దవాఖానలోనే 42 మంది కాలేయ రోగులకు విజయవంతంగా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు చేయడంతోపాటు 5 వేల జీఐ కాంప్లెక్స్ సర్జరీలు, 300 లివర్ క్యాన్సర్ సర్జరీలు నిర్వహించారు.
అరుదైన శస్త్రచికిత్సల నిర్వహణకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఉస్మానియా సర్జికల్ గ్యాస్ట్రో, మెడికల్ గ్యాస్ట్రో వైద్యనిపుణులు 2018లో ఆటో లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌ను విజయవంతంగా జరిపి ప్రపంచ రికార్డు సృష్టించారు. 6 వారాల వయసున్న ఓ చిన్నారిలో కాలేయానికి రక్తాన్ని సరఫరా చేసే నాళాలు సరిగ్గా వృద్ధి చెందకపోవడంతో అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించారు. అందులో భాగంగా ఆ చిన్నారి కాలేయాన్ని తొలగించి కొంత సేపు బయట పెట్టారు. రక్తనాళాలను పునరుద్ధరించిన తర్వాత మళ్లీ అదే కాలేయాన్ని ఆ చిన్నారికి అమర్చారు. ప్రపంచంలో ఇలాంటి శస్త్రచికిత్స నిర్వహించడం ఇది రెండోసారి. గతంలో తొలిసారి కెనడాలో ఈ తరహా సర్జరీ జరిగినట్టు ఉస్మానియా సర్జికల్ గ్యాస్ట్రో విభాగాధిపతి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. ‘అలిగెలి’ సిండ్రోమ్తోపాటు గుండె సమస్యతో బాధపడుతున్న మరో రెండేండ్ల చిన్నారికి సైతం లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌తో పునర్జన్మ ప్రసాదించిన ఉస్మానియా వైద్యులు.. తాజాగా అరుదైన ‘మార్ఫన్’ రుగ్మతతోపాటు కాలేయ వ్యాధితో బాధపడుతున్న 14 ఏండ్ల బాలుడికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ నిర్వహించి ప్రపంచంలోనే తొలిసారి ఈ ఘనత సాధించారు.
ప్రభుత్వ సహకారంతోనే నిరుపేద రోగులకు అత్యంత ఖరీదైన, సంక్లిష్టమైన సర్జరీలను ఉస్మానియా దవాఖానలో ఉచితంగా చేయగలుగుతున్నాం. ఇటీవల 14 ఏండ్ల బాలుడికి జరిపిన కాలేయ మార్పిడి శస్త్రచికిత్స ప్రపంచంలోనే మొదటిది. గతంలో ఎక్కడా ఇలాంటి శస్త్రచికిత్సలు జరిగిన దాఖలాలు లేవు. అత్యంత క్లిష్టమైన కేసులకు కూడా ఉస్మానియా దవాఖానలో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు చేస్తున్నాం. అలా 2015 నుంచి ఇప్పటివరకు 42 కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు చేశాం. ఆ రోగుల్లో 12 మంది చిన్నారులు కూడా ఉన్నారు. వీరితోపాటు 5 వేల మందికి జీఐ కాంప్లెక్స్ సర్జరీలు, 300 మందికి లివర్ క్యాన్సర్ సర్జరీలు నిర్వహించాం. ఇవన్నీ ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తి ఉచితంగా చేసినవే. నిరుపేద రోగులకు ఉచితంగా వైద్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.