హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో పనిచేస్తున్న వివిధ రంగాల ఉద్యోగుల్లో ఫ్యాటీ లివర్, గుండె జబ్బులు, మానసిక వ్యాధులు గణనీయంగా పెరుగుతున్నట్టు ‘ది థ్రైవ్-2025’, ‘వరల్డ్ హార్ట్ డే-2025’ అధ్యయన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 20కిపైగా కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న 30 వేల మందిపై అధ్యయనం నిర్వహించామని, వారిలో 70% మంది మిల్లెనియల్స్ (1981 నుంచి 1996 మధ్యలో జన్మించిన వ్యక్తుల)కు గత మూడేండ్లలో గుండె జబ్బుల ముప్పు పెరిగిందని, ఇందులో 65% మంది ఉద్యోగులు రోజూ 30 నిమిషాల కంటే తక్కువగా శారీరక శ్రమ చేస్తున్నారని ‘వరల్డ్ హార్ట్ డే’ నివేదిక వెల్లడించింది.
ప్రతి ఐదుగురిలో ఒక్కరు హైపర్ టెన్షన్‌తో బాధ పడుతున్నట్టు తెలిపింది. 30-40 ఏండ్ల వయసున్న వారిలో 38% మంది హై కొలెస్ట్రాల్‌తో బాధ పడుతున్నారని, ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం, మానసిక ఒత్తిడి, సరైన జీవన శైలి ప్రమాణాలు పాటించకపోవడం ఇందుకు కారణమని వివరించింది. 56% మంది ఉద్యోగులు పని ఒత్తిడితో తీవ్ర ఆందోళన చెందుతున్నారని ‘ది థ్రైవ్-2025’ రిపోర్టు వెల్లడించింది. 42% మంది నిద్రకు సంబంధించిన రుగ్మతలు, అలసటతో సతమతమవుతున్నారని నివేదించింది.
కాగా, ఐటీ ఉద్యోగుల్లో 84% మందికి ఫ్యాటీ లివర్ ముప్పు ఉన్నట్టు ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), కేంద్ర ఆరోగ్య శాఖ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. వీరిలో 70.7% మంది ఒబెసిటీ, 76.5% మంది హై ఎల్డీఎల్ కొలెస్ట్రాల్, 20.9% మంది ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవల్స్‌తో బాధ పడుతున్నట్టు తేలింది. దీంతో హైదరాబాద్‌లోని ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.