హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్మడ్ ప్రాంతం లో కొనసాగిస్తున్న ‘ఆపరేషన్ కగార్’ను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వామపక్ష నాయకులతోపాటు పలువురు మేధావులు డిమాండ్ చేశారు. అక్కడ జరుగుతున్న ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్డు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించి, దోషులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ‘నక్సల్స్ పట్ల కేంద్రప్రభుత్వ రాక్షస విధానాలను ఖండిద్దాం.. ప్రశ్నించే గొంతుకలను కాపాడుకుందాం’ అనే అంశంపై సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం సదస్సు నిర్వహించా రు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ స దస్సులో ప్రొఫెసర్ హరగోపాల్, మాజీ ఎమ్మె ల్సీ, ప్రొఫెసర్ కే నాగేశ్వర్, మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ సంపాదకులు కే శ్రీనివాస్, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్యపద్మ, రాష్ట్ర కార్యదర్శివర్గ స భ్యులు వీఎస్ బోస్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి ఎస్ బాల్, వామపక్షాల నాయకులు డీజీ నరసింహారావు, చలపతిరావు, మురహరి తదితరులు ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మా ట్లాడుతూ.. దేశంలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని.. మాట్లాడినా, ప్రశ్నించినా అణచివేస్తున్నారని, నిర్బంధ వాతావరణం నెలకొన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. బస్తర్ ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగిస్తామని, అడ్డొస్తే చెట్లతోపాటు మనుషులను కూడా తొలగిస్తామని ఛత్తీస్‌గఢ్ సీఎం మాట్లాడటం ఆందోళనకరమని పేర్కొన్నారు. రాజ్యం చట్టబద్ధమైన హద్దులు దాటి బలప్రయోగ శక్తి వంద రెట్లు పెరిగిందని తెలిపారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. మావోయిస్టుల తరఫున గొంతును వినిపిస్తామని స్పష్టం చేశారు.
నక్సల్స్ పేరుతో ప్రజలను, ప్రశ్నించేవారిని చంపితే ఉరుకోబోమని హెచ్చరించారు. మావోయిస్టులు ప్రజల కోసం అడవిలో పనిచేస్తుంటే.. అమిత్ షా మాత్రం పెట్టుబడిదారుల కోసం ప్రజల మధ్య ఉంటూ ప్రజలనే చంపిస్తున్నారని ఆరోపించారు. 2026 మార్చి నాటికి దేశంలో ఒక మావోయిస్టు కూడా లేకుండా చేస్తామని అమిత్ షా చేసిన ప్రకటనపై ఆగ్రహం వ్యక్తంచేశారు. విప్లవ కళాకారులు, సమాజాన్ని ప్రశ్నించే ప్రతిఒకరూ కమ్యూనిస్టులేనని శ్రీశ్రీ, దాశరథి లాంటివారు చెప్పారని గుర్తుచేశారు.