హైదరాబాద్ :గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. గోపన్నపల్లి సర్వే నంబర్ 127లోని 31 ఎకరాల భూములకు సంబంధించిన హకుల విషయమై తలెత్తిన వివాదంలో ఎన్ పెద్దిరాజు ఫిర్యాదు చేయడంతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ 2020లో రేవంత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపి తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.
ఓటుకు నోటు కేసుకు సీఎం గైర్హాజరు
నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం జరిగిన విచారణకు గైర్హాజరయ్యారు. ఆయన తరఫు న్యాయవాది గైర్హాజరు పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు సీఎంకు మినహాయింపునిచ్చింది. ఈ కేసుతో సంబంధం ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహా తదితరుల గైర్హాజరును కూడా కోర్టు అంగీకరించింది. ఈ విచారణకు సండ్ర వెంకటవీరయ్య, జెరూసలేం మత్తయ్య మాత్రమే హాజరయ్యారు. కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని మత్తయ్య కోరారు. దీనిపై జడ్జి సురేశ్ స్పందిస్తూ హైకోర్టు నుంచి స్టే పొందాలని అప్పుడే ఈడీ కోర్టులో విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. తదుపరి విచారణను జూలై 25కు వాయిదా వేశారు.