హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రభాకర్‌రావును అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని ఆయన తరఫు న్యాయవాది టీ నిరంజన్‌రెడ్డి వాదించారు. అనంతరం ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదిస్తూ.. ప్రభాకర్‌రావుకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఈ కేసులో తాను కూడా వాదనలు వినిపిస్తానని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్రావు చెప్పడం, తనను ప్రతివాదిగా చేర్చాలని కోరుతూ ఇంప్లీడ్ పిటిషన్ వేస్తామని సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావు చెప్పడంపై నిరంజన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తదుపరి విచారణను బుధవారం కొనసాగిస్తామని న్యాయమూర్తి జస్టిస్ జే శ్రీనివాసరావు ప్రకటించారు.