హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి కేంద్రం జారీచేసిన గెజిట్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఏపీ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్ 89 మార్గదర్శకాల మేరకు కాకుండా అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం-1956లోని సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాలను పంచాలని తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం, ఈ నేపథ్యంలో కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ)కి కేంద్రం నూతన మార్గదర్శకాలను జారీచేయడం తెలిసిందే.
కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాలపై అభ్యంతరాలను తెలుపుతూ ఏపీ సర్కారు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. కొత్త టీవోఆర్ చెల్లబోదని, అది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధమని ఏపీ వాదిస్తున్నది. ఆ క్రమంలో ట్రిబ్యునల్ విచారణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. ఏపీ వాదనలను వినిపించేందుకు అనుమతి ఇచ్చింది. ఆ పిటిషన్‌పై విచారణ మంగళవారం కొనసాగాల్సి ఉన్నది. కానీ, అది బెంచ్ మీదకు రాకపోవడంతో విచారణ వాయిదా పడింది.