కొడంగల్, నవంబర్ 20: లగచర్ల కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం కొడంగల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు పట్నం నరేందర్‌రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్నం నరేందర్‌రెడ్డి తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. పట్నం నరేందర్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. పోలీసులు పేర్కొన్న అంశాలపై నరేందర్‌రెడ్డి ఎటువంటి దాడులకు పాల్పడలేదని, అటువంటప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం తప్పు అని వారు తమ వాదనలు వినిపించారు. తమ భూములను కోల్పోతున్నామనే ఆవేదనతో లగచర్లలో ప్రజలు తిరగబడ్డారని, నరేందర్‌రెడ్డి సహా ఏ రాజకీయ నాయకుల ప్రమేయంతో, కుట్రతో కానీ ఈ ఘటన జరగలేదని తెలిపారు. నరేందర్‌రెడ్డిని పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని, పైఅధికారుల ఆదేశాల మేరకు పొలిటికల్ రివెంజ్‌తో ఇబ్బంది పెట్టాలని, కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో పోలీసులు కస్టడీకి అడిగారని కోర్టుకు వినిపించినట్టు న్యాయవాదులు తెలిపారు. కేసు విచారణపై తీర్పును ఈ నెల 22కు వాయిదా వేసినట్లు తెలిపారు.
నరేందర్‌రెడ్డిని పునర్మిచారణ చేయాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌కు ఎటువంటి అర్హత లేదని వాదించామని ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు. గతంలో నరేందర్‌రెడ్డిని విచారించామని, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారని పోలీసులు చెప్పినట్టు న్యాయవాదులు పేర్కొన్నారు. కానీ పోలీసులు పేర్కొన్న మాదిరిగా నరేందర్‌రెడ్డి ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని, జైలర్ సమక్షంలో అఫిడవిట్ తయారుచేసి ఆయన కోర్టుకు సమర్పించారని తెలిపారు. అన్యాయంగా రిమాండ్ చేశారని హైకోర్టులో పెట్టిన పిటిషన్‌పై విచారణ జరిగిందని, తీర్పు రిజర్వ్‌లో పేర్కొన్నారు. నరేందర్‌రెడ్డిని పోలీసుల కస్టడీకి ఇచ్చే ప్రసక్తి ఉండదని, రిమాండ్‌ను కూడా హైకోర్టు కచ్చితంగా కొట్టివేస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. నిందితుడు కన్ఫెషన్ ఇవ్వకుండా, కన్ఫెషన్ తీసుకున్నట్టు పోలీసులు చిత్రీకరించిన ఘటన.. తెలంగాణ జ్యుడీషియల్ చరిత్రలోనే మొదటిసారిదని పట్నం తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. తాను ఇవ్వకుండానే కన్ఫేషన్ను చిత్రీకరించారని జైలర్ సమక్షంలో జైలర్ ప్రామాణికతతో జడ్జికి పట్నం నరేందర్‌రెడ్డి లేఖ రాయడం, అఫిడవిట్ దాఖలు చేయడం మొదటిసారి అని పేర్కొన్నారు. తప్పడు కేసులు పెట్టి జైలుకు తరలించినప్పుడు ఈ విధంగా జైలర్ సమక్షంలో అఫిడవిట్ దాఖలు చేయవచ్చని, లేఖ రాయవచ్చని తెలుసుకోవాలని పేర్కొన్నారు.
లగచర్ల నుంచే సీఎం రేవంత్‌రెడ్డి పతనం ప్రారంభమైందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి హెచ్చరించారని, కేసులో తప్పకుండా నిర్దోషిగా తిరిగి బయటకు వస్తానని నరేందర్‌రెడ్డి పేర్కొన్నారని న్యాయవాది చైతన్య వెల్లడించారు. రైతులకు మద్దతిస్తే అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారని సీఎం, పోలీసులు, ఇంటెలిజెన్స్ నిర్లక్ష్యం కారణంగానే ఆ దాడి జరిగిందని తెలిపారని వివరించారు. న్యాయస్థానంపై గౌరవం ఉన్నదని తెలిపారని చెప్పారు. కొడంగల్ ప్రజలు, రైతుల పక్షాన వందసార్లయినా జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని నరేందర్‌రెడ్డి చెప్పారని చైతన్య తెలిపారు. ఇదిలా ఉండగా, కొడంగల్ కోర్టుకు పట్నం నరేందర్‌రెడ్డి వచ్చినప్పుడు, విచారణ అనంతరం వెళ్లేప్పుడు అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.