హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ డాక్టర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీలో పనిచేస్తున్న బోధన సిబ్బందికి హెల్త్‌స్కీమ్, హెల్త్‌కార్డులు, ఇన్సూరెన్స్ వర్తింపచేయాలని తెలంగాణ వ్యవసాయవర్సిటీ టీచర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను వారు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, బోధన సిబ్బంది నిరంతరం రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ క్రమంలో ఎల్లప్పుడూ వ్యవసాయ క్షేత్రాలు, రైతుల పొలాల్లో పరిశోధన నిమిత్తం తిరుగుతున్నట్టు వివరించారు. దీంతో వారికి, వారి కుటుంబానికి హెల్త్‌కార్డ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వర్తింపజేసి అండగా నిలవాలని కోరారు. వర్సిటీ విజ్ఞప్తిపై దామోదర రాజనర్సింహ సానుకూలంగా స్పందించారని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం శంకర్, ప్రొఫెసర్ రాజేశ్వర్‌నాయక్, డాక్టర్ భరత్‌భూషణ్, డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు, డాక్టర్ పీ రేవతి తదితరులు ఉన్నారు.