హైదరాబాద్‌కు చెందిన శివాని 5వ నెల గర్భిణీగా ఉన్నప్పుడు టిఫా స్కానింగ్ నిర్వహించారు. రిపోర్టులో గర్భంలోని శిశువు గుండెకు చిన్న రంధ్రం ఉన్నట్టు గుర్తించారు. డెలివరీ అయ్యేలోగా అది సహజంగానే పూడిపోవచ్చని లేదా సర్జరీ అవసరం అవు తుందని వైద్యులు చెప్పారు. తగిన జాగ్రత్తలను వివరించారు. ఆ తర్వాత శిశువు ఆరోగ్యంగా జన్మించింది. ఇదొక్కటే కాదు.. ఇలాంటి అనేక సమస్యలను టిఫా స్కాన్ వల్ల ముందే గుర్తించే అవకాశం కలుగుతుంది. తద్వారా పిల్లలు అనారోగ్యం పాలైన తర్వాత సమస్య తెలియకుండా దవాఖానల చుట్టూ తిరిగే బాధలు తప్పుతాయి.
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): తల్లీబిడ్డల సంరక్షణకు చక్కటి చర్యలు తీసుకొంటున్న ప్రభుత్వం.. త్వరలో అత్యాధునిక ‘టిఫా’ స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తేనున్నది. కొంతమంది పిల్లలు పుట్టుకతోనే ఏదోక లోపం కనిపిస్తున్నది. ఈ సమస్యను ముందుగానే గుర్తించేందుకు ‘టిఫా’ (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్) స్కాన్ దోహదం చేస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానల్లో అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాలు ఉన్నా వాటికి టిఫా స్కాన్ తీసే సామర్థ్యం లేదు. దీన్ని గుర్తించిన ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కొనుగోలుకు వెంటనే ఆదేశించడంతో ప్రభుత్వ ప్రసూతి కేంద్రాల్లో టిఫా స్కానింగ్ సదుపాయం కలిగిన 53 అల్ట్రాసౌండ్ మెషీన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రేడియాలజిస్టులు, గైనకాలజిస్టులకు శిక్షణ కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రైవేట్ ల్యాబ్‌ల్లో టిఫా స్కాన్‌కు రూ.1500 -2000 వసూలు చేస్తున్నారు. ఈ భారం పూర్తిగా తప్పనున్నది.
అంతర్జాతీయ నివేదికలు, వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం 7 శాతం శిశువుల్లో లోపాలు ఉండే అవకాశం ఉన్నది. అంటే పుట్టే ప్రతి 100 మందిలో ఏడుగురు శారీరకంగా ఏదో ఒక లోపంతో పుడతారు. మేనరిక వివాహాలు, జన్యు సంబంధ లోపాలు, ఆలస్యంగా గర్భం దాల్చడం, కొందరికి గర్భం దాల్చినప్పటి నుంచే శారీరక, మానసిక సమస్యలు ఉత్పన్నం కావడం, సరైన పోషకాహారం లేకపోవడం.. ఇలా ఎన్నో కారణాల వల్ల శిశువుల్లో లోపాలు తలెత్తుతాయి. అయితే ఇందులో అత్యధిక శాతం ముందే గుర్తిస్తే నయం చేయగలిగేవే. ఇలాంటి లోపాలను ‘టిఫా స్కాన్’తో గుర్తించే అవకాశం ఉన్నది.
కింగ్‌కోఠి దవాఖానకు నిత్యం 150-300 మంది వరకు గర్భిణులు వస్తున్నారు. నెలకు 250-300 వరకు డెలివరీలు జరుగుతున్నాయి. వారికి అన్ని రకాల టెస్టులు, స్కానింగ్‌లు ఉచితంగా చేస్తున్నాం. టిఫా స్కానింగ్ యంత్రాలు లేకపోవడంతో బయటకు పంపాల్సి వస్తున్నది. కొందరు ఆర్థికభారంతో ఈ స్కానింగ్ తీసుకోవడం లేదు. ఇక ఈ సమస్య తీరనున్నది.
-డాక్టర్ జయశ్రీ, గైనకాలజిస్ట్, కింగ్‌కోఠి జిల్లా దవాఖాన