హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): పాతతరం రాజకీయ నేతలకు కాలం చెల్లిందని.. కొత్త తరం రాజకీయాల్లో రావాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో శనివారం నిర్వహించిన ‘భారత్ సమ్మిట్’లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విధానాలను తాము వ్యతిరేకిస్తామని.. ఆ విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుందని అన్నారు. బీజేపీ ద్వేషం, కోపం, భయాలతో ముందుకు సాగితే.. తాము మాత్రం ప్రేమ, అనురాగం, ప్రజల సమస్యలను వినడంపైనే దృష్టి సారించామని తెలిపారు.
గత పదేండ్లలో ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు మారిపోయాయని.. మోడ్రన్ సోషల్ మీడియా జనరేషన్ వచ్చాక రాజకీయాల్లో పాతతరం రాజకీయ నేతలకు కాలం చెల్లిందని అన్నారు. కొత్త తరం పాలిటిక్స్‌లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. విద్య, ఆరోగ్యం, ప్రజాస్వామ్య విలువల పునరుద్ధరణపై యువతలో భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయని.. అవి దేశానికి దిశానిర్దేశం చేసేవిలా ఉండాలని ఆకాంక్షించారు.
భవిష్యత్తులో మూసీ నదిని నగరానికి అతిపెద్ద ఆకర్షణగా మార్చి వేల మందికి ఉపాధిని కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. భారత్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. న్యూయార్క్‌లోని హడ్సన్, లండన్‌లోని థేమ్స్, టోక్యోలోని సుమిదాతో సహా అనేక నగరాల్లో నదులను, నది తీర అభివృద్ధిని అధ్యయనం చేసినట్టు తెలిపారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి.. పేదలకు పంచడమే తమ ధ్యేయమని చెప్పారు. తాము ఇప్పుడే పనులు మొదలు పెట్టామని.. భవిష్యత్తులో ఇంకా చేయాల్సింది చాలా ఉందని స్పష్టం చేశారు. త్వరలో గిగ్, యాప్ వర్కర్స్ వెల్ఫేర్ పాలసీని రూపొందించబోతున్నట్టు ప్రకటించారు.
భారత్ సమ్మిట్‌లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వీఐపీ మూమెంట్ ఉందని చెప్పి.. మధ్యాహ్నం నుంచి హెచ్ఐసీసీలోకి మీడియాను అనుమతించలేదు. అప్పటికి ఇంకా వేదికమీదకు రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి రాకపోయినా.. మీడియా ప్రతినిధులను నిలిపివేశారు.
భారత్ సమ్మిట్-2025 అట్టర్‌ప్లాఫ్ అయింది. మధ్యాహ్నం 3గంటల నుంచి విదేశీ ప్రతినిధుల హడావిడి కనిపించినా.. రాహుల్‌గాంధీ మాట్లాడి వెళ్లిపోయిన వెంటనే విదేశీ ప్రతినిధులు సైతం వెళ్లిపోయారు. అదే సయమంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఓటాఫ్ థ్యాంక్స్ చెప్పాలని పిలువగా.. అప్పటికే వేదికపై నుంచి ముఖ్యులందరూ దిగిపోయారు. ఇద్దరు మంత్రులు తప్ప వేదికంతా ఖాళీగానే కనిపించింది.