జనగామ, నమస్తే తెలంగాణ, జనవరి 5: దమ్ముంటే జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు. జనగామలో మంగళవారం కేటీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను సోమవారం ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తదితరులు పరిశీలించారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఎన్నికలు పెడితే కేసీఆర్ గొప్పతనం.. రేవంత్ పనితనం ఏమిటో బయటపడుతుందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌తో కుమ్మక్కైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాజెక్టులపై బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. అబద్ధపు మాటలతో న మ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మేపరిస్థితి లేదని అన్నారు. రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను పక్కనబెట్టి సాగునీటి ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్, హరీశ్‌రావును బద్నాం చేసేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపి పిచ్చి కూతలు కూస్తున్నాడని మండిపడ్డారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు, మూడు సర్పంచ్ స్థానాలను గెలుచుకోలేదని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 45 శాతం స్థానాలను గెలుచుకుందని గుర్తుచేశారు. ఇప్పటికైనా బుద్ధిమార్చుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి పనిచేయాలని హితవు పలికారు.