భీమదేవరపల్లి, జనవరి 7: కాంగ్రెస్ సర్కార్ అమలు చేయనున్న ఆరు గ్యారెంటీల కోసం సాక్షాత్తు దేవుడే దరఖాస్తు చేసుకున్నాడు. శివయ్య పేరిట ఏకంగా శివుడి ఫొటోతో దరఖాస్తు వచ్చినా అధికారులు స్వీకరించి రసీదు కూడా అందజేశారు. ఈ వ్యవహారంలో అధికారుల అలసత్వం కొట్టొచ్చిన ట్టు కన్పిస్తున్నది. అధికారులు దరఖాస్తు తీసుకోవడంపై సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారంలో ఓ వ్యక్తి ఏకంగా శివయ్య (పరమ శివుడు) పేరిట ప్రజాపాలనలో దరఖాస్తు చేశాడు. దరఖాస్తుదారు శివ య్య అయితే అతని భార్య పార్వతీదేవి, కుమారులు కుమారస్వామి, వినాయకుడిగా పేర్కొన్నాడు. దరఖాస్తు ఫారంపై శివుడి ఫొ టోను అతికించాడు. శివుడి పుట్టిన తేదీ 01-01-1200గా పేర్కొన్నాడు. ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత పథకాల కోసం దరఖాస్తు చేశాడు. దరఖాస్తు ఫారం తీసుకున్నవాళ్లు రసీదు ఇవ్వడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. శివ య్య పేరిట దరఖాస్తు ఫారం తానే ఇచ్చినట్టు అదే గ్రామానికి చెందిన ఏనుగు వెంకట సురేందర్‌రెడ్డి అంగీకరించారు. ముత్తారంలో కాకతీయులు నిర్మించిన అతి ప్రాచీన త్రికూటాలయం ఉన్నదని, ఆలయ పునరుద్ధరణకు ఒక గది, విద్యుత్తు ఇతరత్రా సౌకర్యాలు కల్పించాలనే తాను ఈ పనిచేశానని పేర్కొన్నాడు. ఇందులో అధికారుల తప్పిదం లేద ని, సర్పంచ్ రేణికుంట్ల శాంతికుమార్‌కు లిఖితపూర్వకంగా రాసిచ్చాడు. ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణలో అధికారుల అలసత్వం బట్టబయలైందని, దరఖాస్తులు పరిశీలిస్తే అధికారులు రసీదు ఎలా ఇస్తారని పలువురు బాహాటంగా ప్రశ్నిస్తున్నారు.