హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ ఉపనేత వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిశారు. హామీలలో ప్రధానమైన ఐఐఎంను వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. గత కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టిందని, అందులో భాగంగా జిల్లాకో మెడికల్, నర్సింగ్ కాలేజీ ఏర్పాటుచేయటమే కాకుండా గురుకులాలను మూడింతలకు పెంచిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ సర్కార్ జిల్లాకో నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు కేంద్రానికి నివేదించిందని, ఇప్పటికైనా నవోదయ పాఠశాలలు ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు కేంద్రమంత్రి ప్రధాన్ సానుకూలత వ్యక్తంచేశారు.