ఇండోర్, మే 27: అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఓ వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న మహిళ మృతదేహాన్ని రోడ్డుపై వదిలేశాడు. ఆదివారం ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. ‘మహిళ శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. దీర్ఘ కాలిక కాలేయ సంబంధ వ్యాధులతో ఆమె సహజ మరణం పొందినట్టు శవ పరీక్షలో తేలింది’ అని ఏసీపీ నందిని శర్మ తెలిపారు. మహిళ శవాన్ని గోనె సంచిలో ఉంచి రోడ్డుపై వదిలేసిన అనంతరం ఆమెతో సహ జీవనం చేసిన వ్యక్తి ఓ ఉద్యానవనంలో సంచరిస్తూ కనిపించాడని.. అతడి మానసిక స్థితి సరిగా లేనట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. మూడు రోజుల నుంచి దుర్వాసన వస్తున్నదని ఇరుగు పొరుగువారు ఫిర్యాదు చేసినా అతడు పట్టించుకోలేదని వారు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.