చౌటుప్పల్, అక్టోబర్ 1: రేవంత్‌రెడ్డి పాలనలో రియల్ వ్యాపారం కుదేలైంది. అత్యవసరాల కోసం ఆస్తులు అమ్ముకోవాలంటే సామాన్య ప్రజలు నానా తంటాలు పడాల్సి వస్తున్నది. కొనుగోలుదారులు రాకపోవడంతో చేసేదేమి లేక ఓ వ్యక్తి చిన్న గది ఉన్న ప్లాటును లక్కీడ్రా రూపంలో అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణానికి చెందిన కంచర్ల రాంబ్రహ్మచారికి స్థానికంగా 65వ జాతీయ రహదారి పక్కన 66 గజాల ఇంటి స్థలాన్ని రూ.16 లక్షలు అమ్మకానికి పెట్టాడు. ఇటివల మార్కెట్ పెద్దగా లేకపోవడంతో ఎవరూ ముందుకు రాలేదు. చివరకు లక్కీడ్రా ఏర్పాటు చేశాడు. రూ.500కు లాటరీ టికెట్లను అమ్మకానికి పెట్టాడు. నవంబర్ 2న డ్రా తీయనున్నాడు. ఈ డ్రాలో గెలుపొందిన విజేతకు అతడు సదరు ప్లాటు ఇవ్వనున్నాడు. రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ భూముల దుస్థితి ఇది అంటూ నెట్టింట్లో కామెంట్లు వస్తున్నాయి. అందరి నోటా ఇదే చర్చసాగుతున్నది. కాంగ్రెస్ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నదని ఈ లక్కీడ్రా అంశం స్పష్టం చేస్తున్నది.
అమ్మకానికి అనేక పాట్లు, భూములు
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రియల్ రంగం ఢమాల్ కావడంతో జిల్లాలో వ్యవసాయ భూములకు, ప్లాట్లకు డిమాండ్ బాగా తగ్గింది. రెండేండ్ల నుంచి క్రయవిక్రయాలు మందగించాయి. పిల్లల చదువులు, విహహాలు చేయలేక, విదేశాలకు పంపడానికి డబ్బుల కోసం ప్లాట్లు అమ్ముకోవాలనుకునే వారు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక అవసరాల కోసం గత్యంతరం లేక అడ్డికి పాపుసేరు లెక్కన అమ్ముతున్నారు. ఇలా జిల్లాలో వేలాది ఎకరాల వ్యవసాయ భూములు, లక్షల్లో ఓపెన్ ప్లాట్లు అమ్మకానికి ఉన్నాయి. కాగా చౌటుప్పల్ మండల వ్యాప్తంగా తీసుకుంటే ప్రస్తుతం ప్రతి నెలా 200 వరకు డాక్యుమెంట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాయలంలో రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఈ రిజిస్ట్రేషన్ల సంఖ్య 5 రెట్లు ఎక్కువగా ఉండేది. సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయం క్రయవిక్రయాలతో కిటకిటలాడుతుండేది.