హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): పన్ను ఎగవేతల వ్యవహారంలో శ్రీకృష్ణ ఎగ్జిమ్ ఎల్ఎల్పీ సంస్థకు హైకోర్టులో చుక్కెదురైంది. బంగారం దిగుమతులు, ఆభరణాల ఎగుమతుల్లో సుంకాల ఎగవేతకు పాల్పడ్డారన్న ఆరోపణలతో కస్టమ్స్ శాఖ 2022లో జారీచేసిన నోటీసులను సవాలు చేస్తూ ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ శ్యాం కోశీ, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం కొట్టివేసింది. చట్టబద్ధమైన సంస్థలు నిబంధనలకు లోబడి జారీచేసిన నోటీసుల్లో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం పేర్కొంటూ.. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా నోటీసులు జారీ అయినప్పుడే కోర్టు జోక్యానికి ఆసారం ఉంటుందని స్పష్టం చేసింది.