హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం టంగుటూరు గ్రామంలో, చేవెళ్ల మండలం ఎరవ్రల్లిలో భూవివాదానికి సంబంధించిన కేసుల్లో ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులకు సోమవారం హైకోర్టులో ఊరట లభించింది. ఒకే వివాదంపై సివిల్ కేసుతోపాటు క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలనే కుట్రను జీవన్‌రెడ్డి న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. తమ కుటుంబానికి చెందిన 170 ఎకరాల్లో 93 ఎకరాలను మాత్రమే విక్రయించగా మిగిలిన భూమి తమదేనంటూ మాజీ ఎమ్మెల్యే, కుటుంబసభ్యులు బెదిరిస్తున్నారంటూ చైతన్య రిసార్ట్స్‌కు చెందిన సామ దామోదర్‌రెడ్డి చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు కొట్టేయాలని కోరుతూ జీవన్‌రెడ్డి, ఆయన భార్య, తల్లి, సోదరుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. దామోదర్‌రెడ్డి నుంచి తాము భూమిని కొనుగోలు చేశామని, ఆ భూమిపై తమకే హకులున్నాయన్నది వారి వాదన. చట్ట ప్రకారం కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని దామోదర్‌రెడ్డి సివిల్ కోర్టులో దావా వేశారని. సమాంతరంగా అదే వ్యవహారంపై క్రిమినల్ కేసు వేసి అరెస్టు చేసే కుట్ర జరుగుతున్నదని చెప్పారు. ఒకే అభియోగంపై రెండు పోలీసుస్టేషన్లలో కేసులు పెట్టడం చట్టవ్యతిరేకమని ప్రకటించాలని, ఈలోగా పిటిషనర్లను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. ఈ వాదనలను జస్టిస్ లక్ష్మణ్ ఆమోదించారు. పిటిషనర్లను పోలీసులు అరెస్టు చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను వాయిదా వేశారు.
కాంగ్రెస్ ఆశ నెరవేరలేదు: జీవన్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులతో తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపించారు. అక్రమ కేసులతో తనను అరెస్టు చేయాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ఆశలు నెరవేరలేదని పేర్కొన్నారు. తనతోపాటు తన కుటుంబసభ్యులను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. హైదరాబాద్ శివారులోని శంకర్‌పల్లిలో 76 ఎకరాల భూమి విషయంలో తన కుటుంబంపై కేసులు మోపారని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.