హైదరాబాద్, జూన్ 24,(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బుధవారం హైకోర్టులో ఊరట లభించింది. సింగరేణి ఆస్తుల అంశంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో గత నెల 30 నుంచి జైలులో ఉన్న ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల వ్యక్తిగత బాండ్‌తోపాటు అంతే మొత్తానికి మరో ఇద్దరి పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి సోమవారం ఉదయం 11 గంటలకు సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో తదుపరి దర్యాప్తు నిమిత్తం 8 వారాలపాటు లేదంటే చార్జిషీట్ దాఖలు చేసేదాకా హాజరుకావాలని పేర్కొన్నది. కేసులో సాక్షులను ప్రభావితం చేయడం, సాక్ష్యాలను తారుమారు చేయడం వంటివాటికి పాల్పడరాదని పేర్కొన్నది. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి అంశంమైన మీడియా, సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం, పంపడం, వ్యాఖ్యానాలు వంటివి చేయరాదని స్పష్టంచేసింది. మే 26న సింగరేణి భవన్ జూనియర్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ బాల సుమన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కే సుజన విచారణ చేపట్టారు.
ప్రసంగాన్ని వక్రీకరించారు: న్యాయవాది
పిటిషనర్ తరఫు న్యాయవాది టీవీ రమణారావు వాదనలు వినిపిస్తూ ‘ఎలాంటి తప్పు చేయకపోయినా పిటిషనర్‌ను అక్రమంగా కేసులో ఇరికించారని పేర్కొన్నారు. రాజకీయ ప్రసంగాలపై కేసు నమోదు చేయడం రాజకీయ కక్షసాధింపు చర్య, ఈ మేరకు నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలని కోరారు. పిటిషనర్ సుమన్ చేసిన ప్రసంగాన్ని వక్రీకరించి తప్పుడు కేసు పెట్టారని, ప్రసంగం అనంతరం ఎటువంటి హింసాత్మక ఘటనలు, అగ్నిప్రమాదాలు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం జరుగలేదని న్యాయవాది రమణారావు వాదించారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని, జైలులో కొనసాగించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉన్నదని, బెయిల్ ఇవ్వొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించారు. ఇరుపక్షాలవాదనలు, రికార్డులను పరిశీలించిన అనంతరం.. దర్యా ప్తు సంస్థ ఇప్పటికే 14మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసిందని, కేసు దర్యాప్తులో ప్రధాన భాగం పూర్తయిందని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది.