హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మలాజిగిరి జిల్లాలోని సర్వే నం 582, 583లో రూ.కోట్ల విలువైన 55 ఎకరాల భూమి ఆక్రమణకు గురికావడంపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అది ప్రభుత్వ భూమేనని తేలితే చట్ట ప్రకారం వెంటనే స్వాధీనం చేసుకోవాలని స్పష్టంచేసింది. ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ వ్యక్తులు ఇష్టానుసారంగా నిర్మాణాలు జరుపుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది.
ఆ భూమిని కొనుగోలు చేసినట్టు ఎం జనార్దన్ అనే వ్యక్తి తరఫు న్యాయవాది చెప్పినప్పటికీ సంబంధిత దస్తావేజులు, ఇతర వివరాలను సమర్పించలేదు. దీంతో ఆ భూములపై 4 వారాల్లోగా విచారణ జరపాలని, అందుకోసం పిటిషనర్‌తోపాటు ఆ భూమిలో ఉన్నవారందరికీ నోటీసులు జారీచేయాలని ధర్మాసనం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఆ వెంటనే ప్రభుత్వ న్యాయవాది పరసా అనంతనాగేశ్వర్రావు కల్పించుకొని.. అది ప్రభుత్వ భూమని తేలితే స్వాధీనం చేసుకుంటామని, అందుకు అవసరమైతే పోలీసుల రక్షణ తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.