Ekalavya Schools | హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని ఏకలవ్య పాఠశాలల్లో హర్యానా టీచర్లు నియామకం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల 46 పోస్టులను భర్తీ చేయగా, 43 మంది హర్యానాకు చెందిన వాళ్లే ఉండటం ఇందుకు బలం చేకూరుతున్నది. దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో (ఈఎంఆర్ఎస్) ఖాళీ పోస్టులను ఇటీవల కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (ఎన్ఈఎస్టీఎస్) భర్తీచేసింది.
దేశవ్యాప్తంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్ఏ) పోస్టులు 707, బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు 7,702 భర్తీచేసింది. తెలంగాణలోని ఏకలవ్య పాఠశాలల్లో భర్తీ చేసిన 46 పోస్టుల్లో 43 మంది ఒక్క హర్యానాకు చెందినవారే ఉన్నారు. మిగతా ముగ్గురు కూడా ఢిల్లీ నుంచి ఇద్దరు, రాజస్థాన్ నుంచి ఒక అభ్యర్థి ఉన్నారు.
46 పోస్టుల్లో తెలంగాణ నుంచి ఒక్క అభ్యర్థి కూడా లేకపోవడం గమనార్హం. ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నదని తెలిసింది. మొత్తం స్టాఫ్లిస్ట్లో దక్షిణ భారతదేశం నుంచి ఎవరూ లేకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. దేశవ్యాప్తంగా 405 ఈఎంఆర్ఎస్ కొనసాగుతుండగా, మరో 708 స్కూళ్లను మంజూరు చేశారు. ఇంకా 32 పాఠశాలలను మంజూరు చేయాల్సి ఉన్నది. ఈఎంఆర్ఎస్లలో ఆరు నుంచి 12వ తరగతి వరకు బోధిస్తారు. తెలంగాణవ్యాప్తంగా 23 ఈఎంఆర్ఎస్లు ఉన్నాయి.