హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రతిపాదించిన హరిత నిధి అద్భుత ఆలోచన అని ప్రముఖ పర్యావరణవేత్త బోడ నాగేశ్వర్రావు ప్రశంసించారు. అందరూ స్వలాభం కోసమే ఆలోచిస్తున్న ఈ రోజుల్లో ప్రకృతిని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలు అద్భుతంగా ఉంటున్నాయని కొనియాడారు. హరితహారంను విజయవంతంగా నిర్వహిస్తుండటంతో పాటు, ఇందులో అందరినీ భాగస్వాములను చేసేందుకు హరిత నిధిని ఏర్పాటుచేయాలన్న నిర్ణయం గొప్పదని అన్నారు. సోమవారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడిన ఆయన దీర్ఘకాలిక ప్రయోజనాలిచ్చే ఇలాంటి విధానాలకు ప్రతిఒక్కరూ మద్దతు అందించాలని పిలుపునిచ్చారు.
నిధితో బాధ్యత
ఒక మహత్కార్యాన్ని పూర్తిచేయాలంటే అందరి భాగస్వామ్యం ఉండాలని, అదే తరహాలో హరిత నిధి ఏర్పాటు జరుగుతున్నదని నాగేశ్వర్రావు అన్నారు. ప్రస్తుత, భావి తరాలు సుఖంగా జీవించేందుకు ప్రతిఒక్కరు నిధికి తోడ్పాటునందించాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం విజయవంతంగా నడుస్తున్నదని, జిల్లాల్లో తిరుగుతున్నప్పుడు దాని ఫలాలు కనిపిస్తున్నాయని చెప్పా రు. రోడ్లకు ఇరువైపులా నాటిన చెట్లు ఆకుపచ్చ తెలంగాణకు స్వాగతం పలుకుతున్నాయని పేర్కొన్నారు. ఎంపీ సంతోష్‌కుమార్ చొరవతో ప్రారంభమైన గ్రీన్ ఇండియా చాలెంజ్ అన్ని వర్గాలను కదిలించిందని అన్నారు.