హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారం సత్ఫలితాలిస్తున్నది. పట్టణాలు, నగరాలు ఎక్కడ చూసినా పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు ప్రజలకు చక్కటి ఆరోగ్యాన్ని పంచుతున్నాయి. హరితహారం కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహించేందుకు నిధుల కొరత రాకుండా పట్టణ, స్థానిక సంస్థల బడ్జెట్లో 10 శాతం గ్రీనరీకి ఖర్చు చేయాలనే నిబంధన విధించారు. దీంతో పురపాలక సంఘాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. దేశంలో ఏ రాష్ర్టంలో కూడా పట్టణాల్లో గ్రీనరీ కోసం ప్రత్యేకంగా 10 శాతం నిధులను వెచ్చించాలని నిబంధన పెట్టిన దాఖలాలు లేవు. ఇంత పెద్దఎత్తున మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇచ్చిన రాష్ర్టం కూడా లేదు. హరితహారం ఫలితాలను ఇతర దేశాలు, రాష్ర్టాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల తెలంగాణకు వచ్చిన బంగ్లాదేశ్, నేపాల్ పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం హరితహారంలో నాటిన మొక్కలు, ఏర్పాటు చేసిన పార్కులు చూసి ఆనందం వ్యక్తం చేశారు.
ఢిల్లీ బాధలు మనకు రాకుండా..
దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్య భవిష్యత్‌లో తెలంగాణలో రాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయా పట్టణాల బడ్జెట్లో 10 శాతం నిధులను కచ్చితంగా గ్రీనరీ అవసరాల కోసమే వినియోగించాలని నూతన మున్సిపల్ చట్టంలో నిబంధన విధించారు. 2020 నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకు మూడేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా 141 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో గ్రీన్ బడ్జెట్ కింద రూ.775 కోట్లు కేటాయించి ఖర్చు చేశారు. ఈ నిధులతో ప్రధానంగా నర్సరీల ఏర్పాటు, మొక్కలు నాటడం, వాటి పెంపకం, పరిరక్షణతోపాటు పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటుకు ఖర్చు చేస్తున్నారు. గత రెండేండ్లలో పట్టణ ప్రాంతాల్లో 5 కోట్ల మొక్కలు నాటారు. 2021-22 సంవత్సరంలో నాటిన మొక్కల్లో 91 శాతం బతకడం విశేషం.
హరితనిధి
గత ఏప్రిల్ నుంచి హరితనిధి కోసం నిధులు వసూలు చేస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు నెలకు రూ.120 అందజేస్తున్నారు. పట్టణాల్లో దుకాణాల లైసెన్సు జారీ, రెన్యూవల్‌కు రూ.1000 వసూలు చేస్తున్నారు. దీనిద్వారా జీహెచ్ఎంసీ మినహా ఇతర పట్టణాల్లో ఇప్పటివరకు రూ.1.43 కోట్లు వసూలయ్యాయి.
వార్డుకో ట్రీ పార్కు
పట్టణాల్లో ప్రతి వార్డు, డివిజన్‌కు ట్రీ పార్కు, పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని మున్సిపల్ శాఖ లక్ష్యంగా పెట్టుకొన్నది. జీహెచ్ఎంసీ మినహా మిగిలిన 141 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో 3,468 వార్డులు, డివిజన్లు ఉన్నాయి. 2023 కల్లా ప్రతి వార్డు, డివిజన్‌కు ఒక పట్టణ ప్రకృతి వనం, ట్రీ పార్కు ఏర్పాటు చేయనుండగా, ఇప్పటికే 2,697 ట్రీ పార్కులు ఏర్పాటయ్యాయి. వీటిల్లో నవంబర్ చివరి నాటికి 32 లక్షల మొక్కలు నాటారు. వచ్చే ఏడాది 759 ట్రీ పార్కులను నిర్మించనున్నారు.