హైదరాబాద్, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆదివారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు చేసిన ప్రసంగం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులకు సాగునీటి రంగంపై ఓ మంచి క్లాస్ వంటిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. ‘అది నిజంగా మన డైనమిక్ లీడర్ హరీశ్‌రావు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులకు ఒక మాస్టర్ క్లాస్. వారు అయిష్టంగానైనా ఈ సమర్థుడైన కేసీఆర్ శిష్యుడి నుంచి నీటి పారుదల గురించి చాలా నేర్చుకున్నారని నేను భావిస్తున్నా’ అని సోమవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కాళేశ్వరంపై చర్చ సందర్భంగా హరీశ్‌రావు రాష్ట్రంలో నీటిపారుదల రంగం అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు, కాళేశ్వరం ప్రాజక్టు ద్వారా కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆయకట్టు, రైతులకు ఒనగూరిన ప్రయోజనాలపై సుదీర్ఘంగా ప్రసగించిన విషయం తెలిసిందే. మంత్రులు పదేపదే ఆయన ప్రసంగానికి అడ్డు తగిలినా ఎక్కడా సబ్జెక్ట్ నుంచి పక్కదారిపట్టకుండా హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజక్టు విశేషాలను వివరించారు. ఈ క్రమంలో స్పీకర్ ఆయన మైక్‌ను కట్ చేయడంతో మధ్యలోనే తన ప్రసంగాన్ని ముగించాల్సి వచ్చింది.