హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): కృష్ణాజలాల వినియోగంపై కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సోమవారం నిర్వహించే సమావేశానికి మాజీ మంత్రి హరీశ్‌రావును ఆహ్వానించాలని బీఆర్ఎస్ సీనియర్ నేత ఎం నగేశ్ ముదిరాజ్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. కృష్ణాజలాలను ఏపీ ప్రభుత్వం దోపిడీ చేస్తున్నదని విమర్శించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రను వీడాలని సూచించారు. ఏపీ జలదోపిడీపై హరీశ్‌రావు చెప్పేంతవరకూ ప్రభుత్వానికి సోయి రాలేదని మండిపడ్డారు. బీజేపీ నాయకులు కేంద్రంతో మాట్లాడి ఏపీ నీటి అక్రమ తరలింపును అడ్డుకోవాలని కోరారు. ఆంధ్ర పాలకులతో కుమ్మక్కైన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఉద్దేశపూర్వకంగా హరీశ్‌రావును ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఇరికించాలని చూస్తున్నదని విమర్శించారు.