హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఒకే దేశం.. ఒకే విధానం అంటూ ఊదరగొడుతున్న కేంద్రం.. మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కఠిన నిబంధనలు అమలుచేస్తున్నదని, కేంద్రం ఏర్పాటుచేసే ఎయిమ్స్‌లో కనీస వసతులు లేకున్నా అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. ఎయిమ్స్‌కు ఒక నీతి.. రాష్ర్టానికి ఒక నీతా? అని ప్రశ్నించారు. గాంధీ దవాఖానలో శుక్రవారం పీడియాట్రిక్ ఐసీయూ, పీడియాట్రిక్ సర్జరీ ఐసీయూ, ఎంఐసీయూ, సెమినార్ హాల్, వెబ్‌పోర్టల్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులు, సిబ్బంది తదితర అన్ని అంశాల్లో ఎన్ఎంసీ సూచించిన ప్రమాణాలను అందుకున్న తర్వాతే దరఖాస్తు చేస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపిందని గుర్తుచేశారు. సొంత ఖర్చుతో ప్రభుత్వం కాలేజీలు ఏర్పాటు చేస్తుంటే సవాలక్ష కొర్రీలు పెడుతున్నారని, చిన్న కారణాలతో అడ్డుపుల్లలు వేసున్నారని కేంద్రంపై మండిపడ్డారు. కనీస వసతులు లేకున్నా ఎయిమ్స్ ఎలా నడుస్తున్నదని నిలదీశారు. ‘వన్ నేషన్ – వన్ మెడికల్ ఎడ్యుకేషన్’ ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. ఎయిమ్స్‌లో ఇప్పటికీ డాక్టర్ల నియామకం పూర్తి కాలేదని, ఆపరేషన్ థియేటర్లు, బ్లడ్‌బ్యాంకు లేవని, కనీసం ఇన్ పేషెంట్లు కూడా లేరని చెప్పారు. కనీసం ఒక్క డెలివరీ కూడా జరుగలేదని, అయినా ఎంబీబీఎస్ కోర్సు నడిపిస్తున్నారని విమర్శించారు. పిల్లల భవిష్యత్తు ఆగం కావొద్దనే మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వ దవాఖానల్లో ఎయిమ్స్ విద్యార్థుల ప్రాక్టికల్స్‌కు అనుమతి ఇచ్చామని చెప్పారు.
రాష్ర్టానికి రోజుకో కేంద్ర మంత్రి వస్తున్నారని, వారు రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ దవాఖానకైనా వెళ్లి అక్కడి వసతులు పరిశీలించాలని, ఆ తరువాత ఎయిమ్స్‌కు వెళ్లి చూసి రావాలని మంత్రి హరీశ్ సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.500 కోట్ల ఆస్తిని ఇస్తే కేంద్రం ఉద్ధరించింది ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు రాజకీయం చేయడానికి వస్తున్నారో, రాష్ట్ర అభివృద్ధి కోసం వస్తున్నారో ప్రజలు గుర్తించాలని కోరారు. ఈ రోజు తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్లినా ట్రాక్టర్, ట్యాంకర్, నర్సరీ, శ్మశానవాటిక ఉన్నాయని చెప్పారు. ‘తెలంగాణ విధానాలను మీరు చూస్తామంటే దగ్గరుండి చూపిస్తాం. వాటిని మీ రాష్ర్టాల్లో అమలు చేయండి’ అని సవాల్ చేశారు. కేంద్ర మంత్రులు తెలంగాణకు ఉత్త చేతులతో వచ్చి పోతామంటే కుదరదని స్పష్టంచేశారు. రాష్ర్టానికి వచ్చి నేర్చుకొని అయినా వెళ్లాలని, లేదా మీ శాఖల పరిధిలో పెండింగ్ ఉన్న ఫైళ్లన్నీ క్లియర్ చేసి ఇచ్చి వెళ్లాలని తేల్చి చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణను దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా గుర్తించిందని మంత్రి చెప్పారు. ‘మేం పనిచేయకపోతే అవార్డులు ఎందుకు ఇచ్చినట్టు? అవార్డులు మీరే ఇస్తారు, ఉపన్యాసాలు మీరే ఇస్తారు, మళ్లా మీరే తిడుతరా?’ అని నిలదీశారు.
గాంధీ దవాఖానలో అద్భుతమైన సేవలు అందుతున్నాయని మంత్రి హరీశ్‌రావు ప్రశంసించారు. గాంధీ దవాఖాన సామర్థ్యం 1500 పడకలు కాగా, గురువారం 1,683 మంది ఇన్‌పేషెంట్లు ఉన్నారని పేర్కొన్నారు. సిబ్బంది సామర్థ్యానికి మించి సేవలు అందిస్తున్నారని కొనియాడారు. గాంధీ దవాఖానలో అన్నిరకాల అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నాయని, ప్రతి విభాగానికి ఐసీయూ ఏర్పా టు చేశామని చెప్పారు. ఎంఆర్ఐ స్కానిం గ్ యంత్రాన్ని నాలుగు నెలల కిందట ప్రారంభిస్తే.. ఇప్పటివరకు రూ.కోటి విలువైన 1400 స్కానింగ్‌లు పూర్తయ్యాయని తెలిపారు. ఇటీవల క్యాథ్‌ల్యాబ్ ప్రారంభించామని, ఇప్పటివరకు 504 ప్రొసీజర్స్ పూర్తయ్యాయని చెప్పారు. ప్రైవేట్ దవాఖానల్లో రూ.15 లక్షలు ఖర్చయ్యే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు మూడు జరిగాయని చెప్పారు. సుమారు 100 వరకు మోకీలు, తుంటి ఎముక మార్పిడి చికిత్సలు జరిగాయని, ఆర్థోపెడిక్ విభాగం మూడు నెలల్లోనే సుమారు రూ.కోటి విలువైన సేవలు అందించిందని ప్రశంసించారు. నెలకు 800 వరకు డెలివరీలు జరుగుతున్నాయని చెప్పారు. గాంధీలో గతంలో 4-5వేల వరకు ఓపీ ఉండేదని, బస్తీ దవాఖానల ఫలితంగా సగానికి తగ్గిందని తెలిపారు. ఇది ప్రభుత్వం సాధించిన విజయం అని చెప్పారు.