టీఆర్ఎస్ సాగునీటి ప్రాజెక్టులు నిర్మించదని, చుక్కనీరు తీసుకురాదని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రజలను అయోమయానికి గురిచేసిండ్రు. కోర్టుల్లో 350 కేసులు వేయించిండ్రు. మండుటెండల్లో కూడవెల్లి వాగులో ప్రవహిస్తున్న నీటిని చూసి ఆ పార్టీల నాయకులు సిగ్గుపడాలి.
– మంత్రి హరీశ్‌రావు
గజ్వేల్ రూరల్, మార్చి19: రైతుల కన్నీటి కష్టాలను తీర్చేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వందల కిలోమీటర్ల దూరం నుంచి గోదావరి జలాలను తీసుకొస్తే.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నాయకులు సోయితప్పి మాట్లాడుతున్నారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. రైతుల సంక్షేమానికి తెలంగాణలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక, జీర్ణించుకోలేక ఆ పార్టీల నాయకులు తప్పుడు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద యాదాద్రి జిల్లా గండిచెరువు, కూడవెల్లి వాగులోకి కొండపోచమ్మ కాలువ ద్వారా గోదావరి జలాలను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రైతులను కడుపులో పెట్టుకొని చూసుకొంటున్న సీఎం కేసీఆర్‌ను అన్నదాతలు దీవిస్తుంటే.. ఎర్రటి ఎండల్లో వాగులు, కాలువల్లో గోదావరి జలాలు పారుతుంటే.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు దిమాక్ లేకుండా మాట్లాడుతున్నరని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా అని మాట్లాడటం ప్రతిపక్ష నాయకుల అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని చెప్పారు.
కల్లుండి చూడలేని కబోదుల్లా, చెవులుండి వినలేని చెవిటి వారిలా కాంగ్రెస్, బీజేపీ నాయకులు మారారని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. తెలంగాణలో 80 వేల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కేంద్రం తీసుకొన్న చర్యలు ఏంటి అని ప్రశ్నించారు. తన హయాంలో నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్ దేవుళ్ల పేరు పెడితే, దీనిపైనా కొందరు హైదరాబాద్‌లో కూర్చుని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో సాగు, తాగునీటి సమస్యలకు పరిష్కారం చూపి ఉంటే ఇందిరా, రాజీవ్‌గాంధీల పేరు పెట్టేవారమని చెప్పారు. ఇటీవల మల్లన్నసాగర్ నీటితో కొమురవెళ్లి మల్లన్న పాదాలను గోదావరి జలాలతో కడిగామని, యాదాద్రి గండి చెరువు నిండగానే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి అభిషేకం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, రఘోత్తంరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.