హైదరాబాద్, మే 27(నమస్తే తెలంగాణ) : రైతు డిస్కమ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన దరఖాస్తును తిరస్కరించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కు బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు విజ్ఞప్తిచేశారు. కొత్త డిస్కమ్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల్లో అనేక అభ్యంతరాలు, లోపాలను ఎత్తిచూపిన ఆయన.. బుధవారం ఈఆర్సీకి లేఖ రాశారు. నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు రాష్ట్ర ఆవిర్భావానికి మరో ముఖ్య కారణమైన విద్యుత్‌ను తెలంగాణ సమాజంలో విడదీసి చూడలేమని పేర్కొన్నారు. నాటి సమైక్యపాలకులు అమలుచేసిన విద్యుత్ సంస్కరణలే బషీర్‌బాగ్ కాల్పులకు దారితీసిన ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. రైతాంగంపై కరెంట్ చార్జీల భారం మోపడంతో నాడు కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి మలిదశ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన చారిత్రక వాస్తవాన్ని గుర్తుచేశారు.
రాష్ట్ర అవతరణ అనంతరం విద్యుత్‌రంగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చి, భారీగా నిధులు కేటాయించి ఆ రంగాన్ని బలోపేతం చేసి 2018 జనవరి 1నుంచి దేశంలో ఎక్కడాలేని విధంగా రైతాంగానికి నిరంతర, నాణ్యమైన ఉచిత కరెంట్ అందించారని వివరించారు. ఫలితంగా తెలంగాణ వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్‌రంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నదని ఆరోపించారు. రైతు డిస్కమ్ పేరిట మూడో డిస్కమ్‌ను ఏర్పాటుచేస్తామని ప్రకటించడం రైతులు సహా అన్ని వర్గాలను భయాందోళనకు గురిచేస్తున్నని పేర్కొన్నారు. ఆచరణ సాధ్యంకాని విధానాలతో విద్యుత్‌రంగం ప్రైవేటీకరణకు కుట్ర జరుగుతుందనే అనుమానాలున్నాయని, ఈ క్రమంలో ప్రభుత్వ ప్రతిపాదనల్లో లోపాలను ఈఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు.

1) 3వ డిస్కమ్ లైసెన్స్ మంజూరు చేసేందుకు కమిషన్‌పై ఒత్తిడి తెస్తున్నారనే అనుమానాలున్నాయి. బహిరంగ విచారణ పూర్తికాకముందే జూన్ 2నుంచి రైతు డిస్కమ్ ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించడం, ఎంక్వైరీ పూర్తికాకముందే తీర్పు చెప్పినట్టు కనిపిస్తున్నది. కమిషన్ ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణించాలి.
2) రైతు డిస్కమ్ కావాలని రైతులు, రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు అడుగలేదు. క్యాబినెట్ సబ్ కమి టీ నివేదిక లేదు, విద్యుత్ సంస్థల నుంచి ప్రతిపాదన లేదు. ఆర్థిక అంశాలు జీవో 44లో పేర్కొంటూ డిస్కమ్ ఏర్పాటుచేయడం అనుమానంగా ఉన్నది.
3) జీవో 44 పారా-2లో యావరేజ్ బిల్లింగ్ రేట్, యావరేజ్ కాస్ట్ ఆఫ్ సర్వీస్‌లో తేడా ఉన్నది. దీని వల్ల డిస్కమ్ ఆర్థికంగా కుంగిపోతుంది. అంటే డిస్కమ్‌లో ఆర్థిక అంశాల గురించే ఆలోచిస్తున్నారు తప్ప రైతుల సంక్షేమానికి కాదని అర్థమవుతున్నది.
4) జీవో 44లో పారా-4లో ‘టూ ఇంప్రూవ్ ద ఎలక్ట్రిసిటీ సప్లయ్ పొజిషన్ ఆఫ్ ద స్టేట్, ది గవర్నమెంట్ డిసైడెడ్ టు సెటప్ ఏ థర్డ్ డిస్కమ్ ఇన్ ద స్టేట్’ అని పేర్కొన్నారు. అంటే ప్రస్తుతం కరెంట్ సరఫరా సక్రమంగా లేదని ఒప్పుకొంటున్నారా?
5) 1990లో అప్పటి సీఎం చంద్రబాబు చేపట్టిన విద్యుత్ సంస్కరణల తర్వాత థర్డ్ డిస్కమ్ ఏర్పాటు నిర్ణయం చాలా కీలకమైంది. నాడు జరిగిన ప్రజాచర్చలతో పోల్చితే ఇప్పుడు కనీసం ప్రజాభిప్రాయం సేకరించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. ఇలాంటి ముఖ్యమైన నిర్ణయంపై అసెంబ్లీలో చర్చించకపోవడం ఇందుకు బలం చేకూర్చుతున్నది.
6) ప్రజలకు అవగాహన కల్పించడం, చర్చ జరుపడం కమిషన్ బాధ్యతగా మేం భావిస్తున్నం. బహిరంగ విచారణను కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా, అన్ని జిల్లాల్లో రైతులు, ఉద్యోగులు, వినియోగదారులతో ఎంక్వైరీలు నిర్వహించాలి.
7) హైదరాబాద్ మినహా 32 జిల్లాలు, 584 మండలాలకు విస్తరించిన 29 లక్షలకు పైగా సాగు వినియోగదారులకు సేవలందించేందుకు కేవలం 2వేల మంది సిబ్బందిని కేటాయించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే లైన్మన్లు, ఆర్టిజన్లు వెయ్యి మందే ఉన్నారు. 5.5 లక్షల ట్రాన్స్ఫార్మర్లు, 2.6 లక్షల కిలోమీటర్ల ఎల్టీ లైన్లను ఇంత తక్కువ మందితో ఎలా నిర్వహిస్తారు? మండలానికి ఒక ఏఈ ఉంటే ఇకపై నియోజకవర్గానికి ఒక ఏఈని మాత్రమే ప్రతిపాదించడం రైతులకు ఇబ్బందికరమే. సబ్స్టేషన్లు, 33 కేవీ, 11కేవీ లైన్లు పాత డిస్కమ్‌ల పరిధిలో ఉండి, రైతు డిస్కమ్‌కు వాటిపై నియంత్రణ లేక సమన్వయలోపం ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది.
8) రైతు డిస్కమ్‌లో ప్రభుత్వ సర్వీసులు, మిషన్ భగీరథ, ఎత్తిపోతల పథకాలు, మున్సిపల్ మంచినీటి సరఫరా పథకాలను ఎందుకు చేర్చారు? ఈ ప్రతిపాదనలపై రైతుల అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు? ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ సెక్షన్-17(2) ప్రకారం రాష్ట్రంలోని సుమారు 30లక్షల మంది రైతులను సంప్రదించాల్సిన అవసరం లేదా?
9) ఆదాయం చూపెట్టకుండా 35వేల కోట్ల బకాయిలు (లిఫ్ట్ ఇరిగేషన్ రూ.22, 926 కోట్లు, హెచ్ఎండబ్ల్యూడబ్ల్యూఎస్బీ రూ.7,084 కోట్లు, మిషన్ భగీరథ రూ.5,972 కోట్లు వసూలు బాధ్యత థర్డ్ డిస్కమ్‌కు అప్పజెప్పడం తగదు. ప్రభుత్వం నుంచి బడ్జెట్ వెసులుబాటుతో చెల్లింపులు జరుగడం లేదని కరెంట్ కట్ చేస్తే వసూలయ్యే బకాయిలు కావు ఇవి. మరి సిబ్బంది జీతభత్యాలు, ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎలా చెల్లిస్తారు?
10) మొదట అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను కొత్త డిస్కమ్‌కు కేటాయించి, అభ్యంతరాలు రావడంతో జీవో 8 ద్వారా వాటిని పరిశీలిస్తామని ప్రభుత్వం పేర్కొన్నది. ఒప్పందాలపై స్పష్టత లేకుండా లైసెన్స్ ఎలా ఇస్తారో చెప్పాలి?
11) కొత్త డిస్కమ్‌కు నిధులెలా అని అడిగితే ‘తర్వాత బిజినెస్ ప్లాన్ ఇస్తాం’ అని చెప్పడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యం. ఆర్థిక అంచనాలు, అప్పుల సర్దుబాట్లు, సర్కార్ సబ్సిడీ వివరాలు లేకుండా లైసెన్స్ ఇవ్వడమేంటి?
12) ప్రస్తుతం ఉన్న డిస్కమ్‌లలో పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారుల ద్వారా వచ్చే ఆదాయంతో సాగు, గృహ వినియోగదారులకు క్రాస్ సబ్సిడీ లభిస్తున్నది. కానీ కొత్త డిస్కమ్‌లో అలాంటి వెసులుబాటు లేక ప్రభుత్వంపై సబ్సిడీ భారం భారీగా పడే ప్రమాదం ఉన్నది. దీనికి ప్రభుత్వం సిద్ధమేనా?
13) విద్యుత్ చట్టం సెక్షన్-43 ప్రకారం డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ పొందిన ఏ సంస్థ అయినా విద్యుత్ కనెక్షన్ కోరిన వారికి సేవలందించాలి. అలాంటప్పుడు పాత డిస్కమ్‌లు వ్యవసాయ కనెక్షన్లను తిరస్కరించలేవు. రైతు డిస్కమ్ గృహ, వాణిజ్య లేదా ఇండస్ట్రియల్ కనెక్షన్లను తిరస్కరించడం చట్టవిరుద్ధమే.
14) రైతులకు నోటీసులు ఇవ్వకుండా కొత్త డిస్కమ్‌లోకి బదిలీ చేయడం సమంజసమా?
15) థర్డ్ డిస్కమ్‌లోకి ఉద్యోగులను ఆకర్షించేందుకు ప్రమోషన్లు ఇవ్వడం ప్రలోభపెట్టడం కాదా? ప్రస్తుత డిస్కమ్‌లలో ప్రమోషన్లు ఇవ్వకుండా, కొత్త డిస్కమ్‌లో ప్రయోజనాలేమిటి?
16) ఆదాయం లేని వ్యవసాయ కనెక్షన్లు కేంద్రంగా డిస్కమ్ రావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఇది ప్రభుత్వ ఉద్దేశాలపై అనుమానాలు రేకెత్తిస్తున్నది.
17) కొత్త డిస్కమ్ దరఖాస్తులో ఆర్థిక, సాంకేతిక, పాలన, చట్టపరమైన లోపాలున్నాయి. భవిష్యత్‌లో డిస్కమ్‌లను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం గా భావిస్తున్నాం. రైతులు, ఉద్యోగులు, ప్రజలకు లాభం చేకూర్చని ప్రతిపాదనను బీఆర్ఎస్ తరఫున వ్యతిరేకిస్తున్నాం. గౌరవ కమిషన్ డిస్కమ్ లైసెన్స్ దరఖాస్తును నిర్ద్వంద్వంగా తిరస్కరించాలని విజ్ఞప్తి.