హైదరాబాద్: సాయుధపోరాట స్ఫూర్తిని రగిలించిన యోధుడు దాశరథి కృష్ణమాచార్య అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఆయన ఇచ్చిన నా తెలంగాణ కోటి రత్నాల వీణ నినాదం నేటికీ స్ఫూర్తి నిస్తుందన్నారు. తన కవిత్వంతో తెలంగాణ గౌరవాన్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టారని చెప్పారు. దాశరథి కృష్ణమాచార్య శత జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా నివాళులర్పించారు.
‘తెలంగాణ విప్లవ శరధిలో ఎగిసిపడిన కవిత్వ తరంగం, ధిక్కార శతఘ్ని దాశరథి కృష్ణమాచార్యలు గారి శత జయంతి సందర్భంగా ఘన నివాళి. సాయుధ పోరాట స్పూర్తిని రగిలించిన యోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన దాశరథి జైలు గోడల మీద బొగ్గుముక్కతో రాసిన ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అజరామరమై నేటికీ స్ఫూర్తినందిస్తున్నది.
మహోన్నతమైన దాశరథి స్ఫూర్తి కొనసాగే దిశగా, వారి జయంతి రోజున ‘దాశరథి కృష్ణమాచార్య అవార్డు’ను తొలి సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అత్యున్నత శిఖరాల మీద నిలబెట్టే దాశరథి కవిత్వం, సాహిత్యం తెలంగాణ భవిష్యత్తు తరాలకు నిత్యస్ఫూర్తిదాయకం.’ అని హరీశ్‌రావు ట్వీట్ చేశారు.