సిద్దిపేట, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ సాహిత్యరంగ అభివృద్ధికి కృషిచేసిన మహోన్నతుడు నందిని సిధారెడ్డి అని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత టీ హరీశ్‌రావు కొనియాడారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో శనివారం రాత్రి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రఖ్యాత కవి, డాక్టర్ నందిని సిధారెడ్డికి పౌర సన్మానం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కవులు, సాహితీకారులు, ఉద్యోగులు, వ్యాపార వర్గాల వారు ఆయన్ను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం సిధారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ఉద్యమకారులను, కవులు, కళాకారులను తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, వివిధ సంఘాల ప్రతినిధులు దేవీప్రసాద్, కే అంజయ్య, రంగాచారి తదితరులు మాట్లాడారు.