హైదరాబాద్, జూలై 12(నమస్తే తెలంగాణ) : రైతుల పొలాల్లో నీళ్లు పారించాలని ప్రతిపక్షంగా తాము అడిగితే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అ త్యంత జుగుప్సాకరంగా, అడ్డదిడ్డంగా మాట్లాడారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో తీవ్రస్థాయి లో విరుచుకుపడ్డారు. మేడిగడ్డ నుంచి రైతులకు నీళ్లిచ్చేందుకు తమ రక్తమే అడ్డమైతే ఇచ్చేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి మాటల్లో పచ్చి అబద్ధాలు, బూతులు, శాడిజం.. ఈ మూడు లక్షణాలు స్పష్టంగా కనిపించాయని దెప్పిపొడిచారు. హిట్లర్ ఆదర్శమని ప్రకటించుకున్న రేవంత్‌రెడ్డి.. ఆయన తరహాలోనే హంతక భాష మాట్లాడుతున్నారని, హిట్లర్‌కు పట్టిన గతే ఆయనకు పడుతుందని హెచ్చరించారు. ఆదివా రం తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు వే ముల ప్రశాంత్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, సత్యవతిరాథోడ్, సునీతాలక్ష్మారెడ్డి బీఆర్ఎస్ ప్ర ధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమ ణ, ఎమ్మెల్యే వెంకటేశ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మొన్నటిదాకా గోదావరిలో నీళ్లు లేవని అబద్ధాలు చెప్పిన రేవంత్‌రెడ్డి.. కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ వెళ్లి లైవ్‌లో చూ పించగానే నాలుక కరుచుకొని.. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటూ డ్రామాలకు తెరలేపి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని 31నెలలు దాటినా రేవంత్‌రెడ్డికి కాళేశ్వరం, మేడిగడ్డ, కన్నెపల్లి పంప్‌హౌస్‌ల గురించి అవగాహనలేకపోవడం సిగ్గుచేటని హరీశ్ ఎద్దేవా చేశారు. ‘మేడిగడ్డ గేట్లు మూయకుండా కన్నెపల్లి మోటర్లు ఎలా ఆన్ చేస్తారని అంటున్నరు.. సీఎం అజ్ఞానంతో మాట్లాడుతున్నరని గుర్తించి పక్కనే ఉన్న మంత్రి ఉత్తమ్ మైక్ గుంజుకొని గేట్లు మూయకుండా లిఫ్ట్ చేయొచ్చని సరిచేసే ప్రయత్నం చేశా రు. సీఎం అజ్ఞానం చూస్తే జాలేస్తున్నది’ అని దెప్పిపొడిచారు. నీటిమట్టం 93.5 మీటర్లు ఉన్నప్పుడు నిరభ్యంతరంగా నీళ్లు ఎత్తిపోయవచ్చని చెప్పారు. కానీ రేవంత్ మాత్రం కేసీఆర్‌కు పేరొస్తదనో, ఇన్నాళ్లు చేసిన దుష్ప్రచారం తప్పవుతుందనో నీళ్లెత్తకుండా రైతుల నోట్లో మట్టికొడుతున్నారని నిప్పులుచెరిగారు. మొన్నటిదాకా రిటైర్డ్ ఇంజినీర్లను నిపుణులని ఆకాశానికెత్తిన ఆయన.. ఇప్పుడు నీళ్లెత్తుమనగానే జైల్లో పెడుతామని బెదిరించడం, బీఆర్ఎస్కు లొంగిపోయారని నిరాధార ఆరోపణలు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. తెలంగాణ రాకముందు పదేండ్ల కాంగ్రెస్ పాలనలో 6.64 లక్షల ఎకరాలకు నీరందితే, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో 48.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని గుర్తుచేశారు. ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్‌రెడ్డి పాలనలో కనీసం ఎకరానికైనా నీరందించారా? అని నిలదీశారు.
మేడిగడ్డ ఫిజుబుల్ కాదని, అక్కడ బరాజ్ కట్టొద్దని రిటైర్డ్ ఇంజినీర్లు ఏనాడూ చెప్పలేదని స్పష్టంచేశారు. కానీ మేడిగడ్డ నుంచి మిడ్‌మానేర్‌కు నేరుగా నీళ్లు తీసుకెళ్లడం సాధ్యం కాదని చె ప్పారు. అదే విషయాన్ని ఘోష్ కమిషన్‌కు అఫిడవిట్ రూపంలో రిపోర్ట్ ఇచ్చారని గుర్తుచేశారు. వారి సూచనల మేరకు వరుస బరాజ్‌లు కట్టి, లి ఫ్ట్లు పెట్టి మిడ్‌మానేర్‌కు నీటిని తరలించామని తెలిపారు. మేడిగడ్డతో సంబంధంలేకుండా కన్నెపల్లి మోటర్ల ద్వారా రూ.8.5 కోట్ల ఖర్చుతో కాఫర్‌డ్యామ్ కట్టి ఎల్లంపల్లికి నీళ్లు తరలించవచ్చని నీటిపారుదల అధికారులు లేఖ రాసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే ఆ లేఖ ను బయటపెట్టాలని సవాల్ విసిరారు.
వానల్లేక వేసిన విత్తులు కండ్లముందు వట్టిపోయి కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతులు నీళ్లు అడుగుతున్నరు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మా రక్తం అడుగుతున్నరు. ఇదేనా ఓ ముఖ్యమంత్రి మాట్లాడే భాష.. షాబాద్‌లో ఆరుగురిని చంపిన హంతకుడికీ నీకు తేడా ఏమున్నది? రైతులకు నీళ్లిచ్చేందుకు మా రక్తమే అడ్డమైతే ఇచ్చేందుకు కూడా సిద్ధం.
ఎల్లంపల్లి ప్రాజెక్టును 20ఏండ్ల క్రితమే కాంగ్రెస్ కట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పింది పచ్చి అబద్ధమని హరీశ్‌రావు కొట్టిపారేశారు. ‘2004లో నేను మంత్రిగా ఉన్నప్పుడే ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. 2014వరకు కాంగ్రె స్ ప్రభుత్వం రూ.3,347 కోట్లు ఖర్చుపెట్టి 5 టీఎంసీల నీళ్లు నిలుపలేకపోయింది. కానీ బీఆర్ఎస్ గద్దెనెక్కిన తర్వాత రూ.2,052 కోట్లు ఖర్చుపెట్టి 2016 తర్వాతనే ప్రాజెక్టును పూర్తిస్థాయిలో 20 టీఎంసీలతో వినియోగంలోకి తెచ్చింది’ అని గుర్తుచేశారు. వాస్తవాలిలా ఉంటే సీఎం మాత్రం 20ఏండ్ల నుంచే ఎల్లంపల్లి నుంచి నీళ్లు తరలిస్తున్నామనడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు గోదావరిలో కొట్టుకుపోయాయని సీఎం పదే పదే అబద్ధాలు చెప్పడాన్ని హరీశ్ ఖండించారు. ప్రాజెక్టుకు కేసీఆర్ ప్రభుత్వం వెచ్చించిన ఖర్చు రూ.87వేల కోట్లు కానీ లక్ష కోట్ల అవినీతి జరిగిందని నిస్సిగ్గుగా ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. ‘రేవంత్‌రెడ్డి మేమే కాదు.. మీ మామ పద్మారెడ్డి కూడా చెప్పారు.. కావాలంటే ఆ వీడియోను పంపిస్తా చూసుకోండి.. ఆయన మాటలు కూడా చెవికెక్కలేదా’ అంటూ చురకలంటించారు.
ఏ సీజన్లో ఏ పనులు కూడా చేయడం తెలియని ముఖ్యమంత్రి ఎక్స్ఫర్ట్స్ను, ఆర్మీ ఇంజినీర్లను తెచ్చామని గొప్పలు చెప్పడం విడ్డూరమని హరీశ్ నిప్పులు చెరిగారు. ‘మీరు తెచ్చిన ఆర్మీ ఇంజినీర్లు ఇక్కడ ఉద్ధరించిందేంది? ఎస్ఎల్బీసీ కుప్పకూలి 8మంది మరణించడమా? సుంకిశాల కుప్పకూలడమా? వట్టెం పంప్‌హౌస్ మునగడమా? ఖమ్మంలో పెద్దవాగు కొట్టుకుపోవడమా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
రేవంత్‌రెడ్డీ.. ఈగోలు, పంతాలు, పట్టింపులకు పోయి రైతుల పంటలను ఎండబెట్టకండి. తక్షణమే కన్నెపల్లి, దేవాదుల మోటర్లను ఆన్‌చేసి రాష్ట్రాన్ని కరువుబారి నుంచి కాపాడండి. క్రెడిట్ అంతా మీరే తీసుకోండి. లేకపోతే ఎండిన ప్రతి పంటకు, రాలిన ప్రతి రైతు కన్నీటిబొట్టుకూ తెలంగాణ సమాజం మిమ్మల్ని దోషిగా బోనుల నిలబెడుతుంది.. ఖబడ్దార్!
– హరీశ్‌రావు
ఎన్డీఎస్ఏ చట్టం రాష్ట్రాల హక్కులను కాలరాయడమే అని ఎంపీగా పార్లమెంట్లో రాతపూర్వకంగా వ్యతిరేకించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మం త్రి అయిన తర్వాత మాట మార్చడం దుర్మార్గమని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. నాడు వ్యతిరేకించిన ఎన్డీఎస్ఏ ఇవాళ బైబిల్లా కనపడుతున్నదని దెప్పిపొడిచారు.
మేడిగడ్డపై నివేదిక ఇచ్చిన ఎన్డీఎస్ఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, అతుల్‌జైన్ 2019 నుంచి 2024వరకు పోలవరం ప్రాజెక్ట్ సీఈవోలని హరీశ్ గుర్తుచేశారు. వారి పర్యవేక్షణలో నిర్మించిన పోలవరం కాఫర్‌డ్యామ్, డయాఫ్రమ్ వాల్ అనేకసార్లు కొట్టుకుపోయి రూ.7వేల కోట్లకుపైగా నష్టం జరిగింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఆ 7వేల కోట్ల నష్టానికి కారకులైన వారికి ప్రమోషన్లు ఇచ్చి ఇక్కడికి పంపితే మేడిగడ్డ కుంగుబాటుపై రిపోర్టులు ఇస్తారా? ఇదెక్కడి విడ్డూరం అని తూర్పారబట్టారు.
అంతులేని అజ్ఞానం మూర్తీభవించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్టిసీమపై వితండవాదనను తెరపైకి తెచ్చారని హరీశ్ దుయ్యబట్టారు. పోలవరం పూర్తయిన తర్వాత ఆ ప్రాజెక్టు నిష్ఫలమని చెబుతూనే బీఆర్ఎస్పై నెపంనెట్టి తప్పించుకోవడం శోచనీయమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టాల్సిన సీఎం.. గురుదక్షిణ కింద ఏపీకి మేలుచేసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి పట్టింపులకు పోకుండా తక్షణమే కన్నెపల్లి, దేవాదుల మోటర్లను ఆన్ చేయాలని డిమాండ్ చేశారు.
‘చొక్కాలు మార్చినట్టు పార్టీలు మార్చిం ది రేవంత్‌రెడ్డి.. నాది అలాంటి క్యారెక్టర్ కాదు.. నా పుట్టుక బీఆర్ఎస్.. చావు బీఆర్ఎస్సే. ఇప్పటికే వందసార్లు చెప్పిన.. ఇప్పుడు మళ్లీ చెబుతున్నా’ అని హరీశ్‌రావు మరోసారి స్పష్టంచేశారు. మీరు పార్టీ వీడుతున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపణలను ఉటంకిస్తూ ఓ విలేకరి ప్రశ్నించగా హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. ‘20ఏండ్ల రాజకీయ జీవితంలో రేవంత్‌రెడ్డి నాలుగు పార్టీలు మారిం డు. అయినా వ్యక్తిత్వమున్న నాయకుడు ప్ర శ్నిస్తే సమాధానం చెప్పినా అర్థముంటది.. క్యారెక్టర్ లేని, విలువల్లేని, నిజాయితీలేని ఈ ముఖ్యమంత్రికి నా గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది.. ఆయనకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’ అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.