కాళేశ్వరంపై ప్రజాభవన్‌లో రేవంత్ ఇచ్చింది.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ కాదు. కవర్ పాయింట్ ప్రజంటేషన్! కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకొనేందుకు 299 టీఎంసీలపై తప్పుడు ప్రచారం చేస్తున్నరు. నాడు కృష్ణాలో 299 టీఎంసీలు కేటాయించి తెలంగాణకు అన్యాయం చేసిందీ, నేడు ఉన్న 34 శాతం వాటానూ వాడకుండా ద్రోహం చేస్తున్నదీ కాంగ్రెస్సే
– హరీశ్
హైదరాబాద్, జూలై11 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు, నీటి వాటాల్లో నిజానిజాలను తేల్చేందుకు దమ్ముంటే సీఎం రేవంత్‌రెడ్డికి నచ్చిన తేదీల్లో అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ‘శాసనసభలో చర్చకు మేం సిద్ధం. కానీ ఒకటే షరతు! మైక్ కట్ చేయవద్దు.. అసెంబ్లీని వాయిదా వేసి పారిపోవద్దు. ఎన్ని రోజులైనా ఎన్ని గంటలైనా చర్చిద్దాం’ అంటూ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రికి బేసిన్లు తెల్వయి.. సాగునీటి మంత్రికి బేసిక్లు తెల్వయి అంటూ ఎద్దేవాచేశారు. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట గత నెల నిర్వహించిన విచారణకు హరీశ్ హాజరైన విషయం తెలిసిందే. ప్రాజెక్టుకు సంబంధించి క్యాబినెట్ నిర్ణయాలు తదితర సమాచారాన్ని అందజేశారు. అదనపు సమాచారాన్ని అందించేందుకు హరీశ్ మరోసారి జస్టిస్ ఘోష్‌ను శుక్రవారం కలిశారు. అనంతరం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇటీవల ప్రభుత్వం ప్రజాభవన్‌లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వెల్లండించిన అంశాలను తీవ్రంగా ఖండించారు.
కాళేశ్వరంపై 6 సార్లు క్యాబినెట్, 3 సార్లు అసెంబ్లీ ఆమోదం ఉన్నది. ఆ వివరాలను కమిషన్‌కు ఇచ్చినం. విచారణ నేపథ్యంలో వాటిని బయట పెట్టలేం. సందర్భం వచ్చినప్పుడు చెప్తం. వాటికంటే మించిన వివరాలున్నయి. కానీ మేము అడిగిన సమాచారాన్ని ప్రభుత్వం ఇస్తలేదు. విచారణ పారదర్శకంగా ఉండాలనుకుంటే ఎందుకిస్తలేదు? కమిషన్‌ను తప్పుదోవ పట్టించేలా ప్రభుత్వం వివరాలిస్తున్నదనే అనుమానం కలుగుతున్నది.
-హరీశ్‌రావు
అదనపు సమాచారాన్నిచ్చేందుకు సమయమివ్వాలని అడిగితే కమిషన్ గురువారం సమయమిచ్చిందని, అయితే కేసీఆర్ వైద్య పరీక్షల నేపథ్యంలో రాలేకపోతున్నానని రిక్వెస్ట్ చేస్తే జస్టిస్ పీసీ ఘోష్ అంగీకరించారని హరీశ్ వివరించారు. కమిషన్ ఇచ్చిన సమయం ప్రకారం ఈ రోజు జస్టిస్ ఘోష్‌ను కలిసి అదనపు సమాచారం అందించామని వెల్లడించారు. మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను దృష్టిలో పెట్టుకొనే, తమ వద్ద ఉన్నంత మేరకు కమిషన్‌కు స్పష్టమైన సమాచారం ఇచ్చామని వెల్లడించారు. తాము ఇప్పుడు ప్రభుత్వంలో లేమని, డాక్యుమెంట్స్ అన్నీ ప్రభుత్వం వద్దే ఉంటాయని తెలిపారు. ప్రాజెక్టుపై గత ప్రభుత్వంలో తీసుకున్న క్యాబినెట్ నిర్ణయాలు, క్యాబినెట్ నోట్ తదితర సమాచారం కోసం చీఫ్ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీకి లేఖ ద్వారా కోరానని, కానీ ప్రభుత్వం నుంచి స్పందన రావడంలేదని తెలిపారు.
ఈ నేపథ్యంలో తమ వద్ద అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి నోట్ రూపంలో ఇచ్చామని వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు సంబంధించి 6 సార్లు క్యాబినెట్ నిర్ణయాలు జరిగాయని, ఆరు సార్లు క్యాబినెట్ ఆమోదించిన డాక్యుమెంట్లను కమిషన్‌కు అందించామని తెలిపారు. 3 సార్లు శాసనసభ ఆమోదం కూడా పొందిందని, నిర్ణయాలు ఎప్పుడెప్పుడు జరిగాయి? చర్చ తదితర అంశాలను కమిషన్‌కు అందించామని, అసెంబ్లీ ఆమోదమనేది క్యాబినెట్ కంటే కూడా ఉత్తమమైనదని వెల్లడించారు. కమిషన్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ వివరాలను ప్రస్తుతం బయట పెట్టలేమని, సందర్భం వచ్చినప్పుడు పూర్తిగా బయట పెడతామని, కమిషన్‌కు ఇచ్చిన వివరాలకన్నా మించిన వివరాలు ఉన్నాయని వెల్లడించారు. కానీ తాము అడిగిన సమాచారాన్ని ప్రభుత్వం ఇవ్వడం లేదని, పారదర్శకంగా ఉండాలనుకుంటే వివరాలు ఎందుకు ఇవ్వడం లేదని హరీశ్ ప్రశ్నించారు.
సర్ నవాబ్ అలీ నవాబ్ జంగ్ తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులకు ఆద్యుడని మాజీ మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. తన ప్రతిభతో ఇంజినీరింగ్ రంగంలో చెరగని ముద్రవేసిన గొప్పవ్యక్తి అని ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు. నవాబ్ అలీ జయంతిని పురస్కరించుకొని ఆయనకు నివాళులర్పించారు. సర్ అర్థర్ కాటన్, కేఎల్ రావు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య సరసన నిలిచిన గొప్ప ఇంజినీర్ మన తెలంగాణలో జన్మించడం గర్వకారణమని కొనియాడారు. నవాబ్ అలీ జంగ్.. ఆనాడు నిర్మించిన నిజాంసాగర్‌ను కాళేశ్వరం జలాలతో నింపి సజీవంగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం సొంతమని స్పష్టంచేశారు. నవాబ్ జంగ్‌ను స్ఫూర్తిగా తీసుకొని యువ ఇంజినీర్లు జాతి నిర్మాణంలో పాలు పంచుకోవాలని ఆకాంక్షించారు. ఇంజినీర్స్ డే సందర్భంగా ఇంజినీర్లకు శుభాకాంక్షలు తెలిపారు.
కొద్ది నెలల్లో కృష్ణాలో తెలంగాణకు మంచి నీటి వాటా రాబోతున్నదని, అహంకారం, వెటకారం వదిలి తెలంగాణకు ఉపకారం చేసే మంచి బుద్ధితో నడుచుకోవాలని రేవంత్‌రెడ్డికి హరీశ్ చురకలంటించారు. ‘గోదావరిలో 1,000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు ఇచ్చి ఎన్ని నీళ్లన్నా తీసుకుపో అని చంద్రబాబుకు రేవంత్ ఆఫర్ ఇచ్చిండు. రేవంత్‌రెడ్డి అజ్ఞానాన్ని చూసి బాధతో అంటున్న. గోదావరిలో మన వాటా 1,000 టీసీఎంలు కాదు. 2,918 టీఎంసీలు కావాలని కేసీఆర్ అడిగిండ్రు. ఇదే విషయాన్ని నేను బయట పెడితే రేవంత్ నాలుక కరుచుకున్నడు. అజ్ఞానాన్ని సవరించుకునే యత్నం చేసిండు. రేవంత్‌రెడ్డి మాత్రమే కాదు.. ఉత్తమ్ కూడా అజ్ఞానిలా మాట్లాడుతున్నడు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి మన నీటి హకుల గురించి బేసిక్స్ తెల్వక పోవడం బాధాకరం. కృష్ణాలో ఒకవైపు 763 టీఎంసీల వాటా కోసం మన న్యాయవాదులు పోరాటం చేస్తుంటే, ఉత్తమ్ మొన్న 573 టీఎంసీలు చాలంటున్నడు. రేవంత్, ఉత్తమ్ మాటలు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు. చంద్రబాబు చెప్పినట్టు పని చేస్తున్నారా? రాష్ట్రం కోసం పని చేస్తున్నరా?’ అని నిలదీశారు. బాగా చదువుకొని, ఇంజినీర్లతో మాట్లాడి తెలుసువాలని, వాదనలు వినిపించిన అనే ఉత్తమ్‌కు ఈ మాత్రం తెల్వదా?’ అని నిప్పులు చెరిగారు.
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రజాభవన్‌లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై హరీశ్ ఘాటుగా స్పందించారు. ‘అది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు. 50 ఏండ్ల కాంగ్రెస్ ద్రోహ చరిత్రకు కవర్ పాయింట్ ప్రజెంటేషన్. తెలంగాణను ఆంధ్రతో కలిపింది కాంగ్రెస్.. నీళ్లు వదిలిపెట్టి తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్. అజ్ఞానం, అహంకారంతో రేవంత్‌రెడ్డి ఇష్టమున్నట్టు మాట్లాడారు. 299: 512 శాశ్వత ఒప్పందం చేసుకున్నారని పదే పదే అబద్ధం చెప్పడం సిగ్గుచేటు. తాతాలిక నీటి వినియోగం, నీటి పంపకానికి తేడా తెల్వకుండా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నడు. నీటి వినియోగం కేఆర్ఎంబీ చేస్తుంది. నీటి పంపకం ట్రిబ్యునల్ చేస్తుంది. నీటి వినియోగం ఆ ఏడాదికి మాత్రమే పరిమితం. నీటి పంపకం శాశ్వతమైనది. శాశ్వతంగా పంపిణీకి సంతకాలు పెట్టామని చెప్పడం పచ్చి అబద్ధం’ అని స్పష్టం చేశారు. ‘ఉమ్మడి ఏపీలో నాటి కాంగ్రెస్ పాలకులు జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి వంటి చేతగాని నాయకుల వల్ల, వారు పెదవులు మూసుకోవడం వల్ల 299 టీఎంసీలనే మనకు కేటాయించారు. ఆనాడు కిరణ్‌కుమార్‌రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు.
అది శాసనసభ రికార్డుల్లో కూడా ఉన్నది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి నాటి కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన నివేదికలోనూ గోదావరిలో 968, కృష్ణాలో 299 టీఎంసీలు కేటాయించిన విషయాన్ని పొందుపరిచారు. గోదావరిలో 968 టీఎంసీలు ఇచ్చింది కాంగ్రెస్ అని గొప్పలు చెప్తున్న రేవంత్‌రెడ్డి, కృష్ణాలో 299 టీఎంసీలే ఇచ్చి అన్యాయం చేసిన విషయాన్ని ఎందుకు దాస్తున్నారని మండిపడ్డారు. నీటి పంపకమనేది ట్రిబ్యునల్ చేస్తుందని, ఆ ట్రిబ్యునల్‌ను సాధించిందే కేసీఆరే అని గుర్తుచేశారు. ఈరోజు మనకు 763 టీఎంసీల కోసం న్యాయవాదులు, ఇరిగేషన్ శాఖ చేస్తున్న పోరాటంపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. ‘రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చి 20 నెలలైంది.. 299 టీఎంసీలు చాలని 2025లో ఉత్తమ్, రేవంత్ సంతకాలు పెట్టివచ్చిండ్రు. మరి మీరెందుకు సంతకాలు పెట్టిండ్రు?’ అని హరీశ్‌రావు నిలదీశారు.
కేసీఆర్ శాశ్వత ఒప్పందం చేసి ఉంటే తెలంగాణకు 299 టీఎంసీలే ఇచ్చి అన్యాయం చేశారని.. సెక్షన్ 3 కింద నీళ్లు పంపిణీ చేయాలని రాష్ట్రం ఏర్పడిన 42వ రోజునే ఢిల్లీకి ఎందుకు వెళ్తారు? 68 శాతం నదీ పరీవాహక ప్రాంతం ఆధారంగా నీటి వాటా ఇవ్వాలని ఎందుకు అడుగుతారు? నాటి కేంద్ర మంత్రులు ఉమా భారతిని, గడరీని, షెకావత్‌ను, ప్రధానిని కలిసి, సుప్రీం కోర్టు గడప తొకి, నిర్విరామ పోరాటం చేసి సెక్షన్ 3ను ఎందుకు సాధించారు?
-హరీశ్‌రావు
తమ ప్రభుత్వం వచ్చాక రికార్డు స్థాయి పంటలు పండిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలను హరీశ్ ఖండించారు. ‘రేవంత్ రెడ్డికి అతి తెలివి ఎకువ. అందుకే ఆ మాటలు మాట్లాడుతున్నడు. ఉమ్మడి ఏపీలో 54 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చినం అన్నడు. ఎకరాకు 93వేల ఖర్చుతో ఇచ్చాం, కానీ బీఆర్ఎస్ వాళ్లు 15 లక్షల ఎకరాలకే నీళ్లు ఇచ్చారు? అదీ ఎకరాకు 11 లక్షలని అతి తెలివిగా చెబుతున్నడు. కానీ వాస్తవం ఏమిటంటేమంటే కాంగ్రెస్ చెప్తున్న 54 లక్షల ఎకరాల్లో రేవంత్‌రెడ్డి, ఆయన ముత్తాత పుట్టక ముందున్న ఆయకట్టును కూడా కలుపుకొన్నడు. 400 ఏండ్ల కింద కాకతీయులు, రెడ్డి రాజులు కట్టించిన చెరువులు, నిజాంలు కట్టిన ప్రాజెక్టుల ఆయకట్టు కూడా అందులో కలుపుకొన్నడు. కృష్ణా, గోదావరి బేసిన్లో 1956కు ముందే ఎన్నో ప్రాజెక్టులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నయి. ఏపీ ఏర్పాటుకు ముందే 16 లక్షల ఎకరాలకు నీటి పారుదల సౌకర్యం ఉన్నది. అది కూడా కలుపుకొని 54 లక్షలకు ఇచ్చినం అని రేవంత్‌రెడ్డి అంటున్నడు. కానీ ఆ లెక్కలను తొలగొస్తే మిగిలేది 38 లక్షల ఎకరాలే. ఆ 38లక్షల ఎకరాలు కాగితాల మీదనే. ఎస్సారెస్పీ స్టేజ్-2, వరద కాలువ అనేక ప్రాజెక్టులు చూపెట్టారు.
కానీ వాటి కింద నీళ్లిచ్చింది లేదు. ఇక 1956లో రాష్ట్ర బడ్జెట్ రూ.19 కోట్లు. ఆనాటి 100 రూపాయలు ఈనాటి రూ.10,434 సమానం. ఆనాటి రూపాయి నేడు 104 రూపాయలకు సమాధానం. అతితెలివితో ఖర్చుతో పోల్చి ప్రజలను తప్పుదోవ పట్టే ప్రయత్నం చేస్తున్నడు. గతంలో పదేండ్లు కాంగ్రెస్ పాలించింది. అప్పుడు ఇచ్చిన ఆయకట్టు కొత్తది, స్థిరీకరణ కలిపి నికరంగా 6 లక్షల ఎకరాలే. ఇక బీఆర్ఎస్ హయాంలో 17 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు ఇచ్చినం. అందులోనూ 2 లక్షల ఎకరాలను కాంగ్రెస్ తక్కువ చూపుతున్నది. 31 లక్షల ఎకరాలను స్థిరీకరించినం. మొత్తంగా బీఆర్ఎస్ నికరంగా పదేండ్ల కాలంలో 48 లక్షల ఎకరాలకు నీరందించినం’ అని వెల్లడించారు. తమ ప్రభుత్వ హయాంలో 283 లక్షల టన్నుల పంట పండిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గొప్పలు చెప్తున్నారని హరీశ్ మండిపడ్డారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలైంది. ఒక చెరువూ తవ్వలేదు. ఒక చెక్‌డ్యామ్ కట్టలేదు. ఒక ప్రాజెక్టు లేదు. మరి అదెట్లా సాధ్యమైంది? అంటే కేసీఆర్ సర్కారు కృషి ఫలితమే ఆ రికార్డు స్థాయి పంటలు’ అని స్పష్టం చేశారు.
తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఉద్దేశపూర్వకంగా మార్చారని రేవంత్‌రెడ్డి అవే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని హరీశ్ నిప్పులు చెరిగారు. ‘తమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని కేంద్ర ప్రభుత్వ సంస్థ సీడబ్ల్యూసీ చెప్పింది. నాలుగేండ్లలో తమ్మిడిమట్టి పూర్తి చేస్తా అన్నరు. 8 ఏండ్లలో సీడబ్ల్యూసీ నుంచి 160 టీఎంసీల నీటి లభ్యతకు క్లియరెన్స్ ఎందుకు తేలేదు? మహారాష్ట్రతో ఎందుకు అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోలేదు? తమ్మడిహట్టి వద్ద 160 టీఎంసీల లభ్యత లేదు. అకడ ఉండేది 102 టీఎంసీలే. అందులో 44 మాత్రమే తీసుకోవచ్చని తేలింది. పక్కనే వైల్డ్ లైఫ్ ఉండటం వల్ల అనుమతులు రాలేదు. ఇవన్నీ తెలిసీ.. మీలాగా కమీషన్లు తీసుకొని ప్రజలను మోసం చేయాలా? మేడిగడ్డ వద్ద 282 టీఎంసీల నీటి లభ్యత ఉందని వ్యాపోస్ సూచిస్తే అక్కడికి మార్చినం. జలాశయాల సామర్థ్యం, నీటి వినియోగం, ఆయకట్టు, పంపింగ్ సామర్థ్యం, భూసేకరణ పరిహారం పెరిగినయి కాబట్టి అంచనాలు పెరిగినయి. అన్ని ఆధారాలూ ఉన్నయి. దమ్ముంటే నచ్చిన తేదీల్లో అసెంబ్లీలో చర్చ పెట్టు. కానీ ఒకటే షరతు. మైక్ కట్ చేయకూడదు. అసెంబ్లీ వాయిదా వేసుకొని పారిపోవద్దు. ఎన్ని రోజులైనా ఎన్ని గంటలైనా చర్చిద్దాం’ అని సవాల్ విసిరారు.
ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పాలకులు ఇదే జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి వంటివారు పెదవులు మూసుకోవడం వల్ల కృషాణలో 299 టీఎంసీలనే మనకు కేటాయించారు. నాడు శ్రీకృష్ణ కమిటీకి కాంగ్రెస్ ఇచ్చిన నివేదికలోనూ గోదావరిలో 968, కృష్ణాలో 299 టీఎంసీలు కేటాయించిన విషయం పొందుపరిచారు. గోదావరిలో 968 టీఎంసీలు ఇచ్చింది కాంగ్రెస్ అని గొప్పలు చెప్తున్న రేవంత్‌రెడ్డి, కృష్ణాలో 299 ఇచ్చి అన్యాయం చేసిన విషయాన్ని ఎందుకు దాచి పెడుతున్నరు?
-హరీశ్‌రావు
నీటి వినియోగం, మళ్లింపు విషయంలోనూ బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్ చూస్తున్నదని హరీశ్ ధ్వజమెత్తారు. ‘మేం రాయలసీమ లిఫ్టు పనులను, ఎస్ఆర్బీసీ లైనింగ్ పనులను ఆపినం. మీరు వచ్చిన తర్వాతే, చేతగానితనం వల్లే ఎస్ఆర్బీసీకి గత వేసవిలో లైనింగ్ అయ్యింది. నీళ్లు ఎక్కువగా తీసుకుపోతున్నరు. నాడు, నేడు ఎప్పుడూ కాంగ్రెస్‌దే ఆ పాపం. నాడు కృష్ణాలో తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించి అన్యాయం చేసింది కాంగ్రెస్. నేడు కూడా అదే ద్రోహం. ఉన్న తాత్కాలిక వాటా 34 శాతం నీటిని కూడా వాడటం లేదు. నిరుడు 28 శాతమే వాడారు. ఆరున్నర లక్షల ఎకరాలు సాగయ్యే 65 టీఎంసీలను ఆంధ్రకు, చంద్రబాబుకు గురుదక్షిణగా చెల్లించారు. ఎందుకు 6 శాతం తక్కువగా జలాలను వాడారు? నీళ్లు చంద్రబాబుకు, ఆంధ్రాకు ఎందుకు వదిలారు? ఇది మీ వైఫల్యం కాదా?’ అని నిప్పులు చెరిగారు. చర్చకు తాము సిద్ధమని, త్వరలోనే మీడియా ముఖంగా ప్రజెంటేషన్ ఇస్తామని వెల్లడించారు.
కృష్ణాలో ఒకవైపు 763 టీఎంసీల వాటా కోసం మన న్యాయవాదులు పోరాటం చేస్తుంటే.. ఉత్తమ్ మొన్న 573 టీఎంసీలు చాలంటున్నడు. రేవంత్, ఉత్తమ్ మాటలు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు. చంద్రబాబు చెప్పినట్టు పని చేస్తున్నారా? రాష్ట్రం కోసం పని చేస్తున్నారా? బాగా చదువుకొని, ఇంజినీర్లతో మాట్లాడి తెలుసుకోండి. బేసిన్ల గురించి తెల్వని ఆయన సీఎం అయ్యిండు. బేసిక్స్ తెల్వని ఆయన నీటి పారుదల శాఖ మంత్రి అయ్యిండు.
-హరీశ్‌రావు