హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి స్థానికతను నిర్ధారించడంపై ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలని మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు ప్రభుత్వం జీవో 33 విడుదల చేసిన నేపథ్యంలో.. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం హైదరాబాద్‌లో హరీశ్‌రావును కలిశారు. ప్రభుత్వ అనాలోచిత జీవో వల్ల తమ పిల్లలు వైద్య విద్య చదివే అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నాలుగేండ్ల నిబంధనవల్ల తెలంగాణలో పుట్టిన పిల్లలు సొంత రాష్ట్రంలోనే నాన్‌లోకల్ కావడం బాధగా ఉన్నదని గోడు వెల్లబోసుకున్నారు.
న్యాయం జరిగేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని హరీశ్‌రావును కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు తీవ్రనష్టం చేస్తున్న జీవో 33పై పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని.. బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా అడ్మిషన్ల కోసం స్థానికతను నిర్ధారించుకోడానికి కొత్త సమగ్ర విధానం రూపొందించాని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి కమిటీని వేసి తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవటంతో పారిశుద్ధ్య నిర్వహణ కష్టంగా మారిందని చెప్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉలికి పడుతున్నదని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 9 నెలల్లో గ్రామ పంచాయతీలకు 9 పైసలు కూడా చెల్లించలేదనేది అబద్ధమా? కేంద్రం నుంచి ఉపాధిహామీ, హెల్త్ మిషన్ పథకాల కింద వచ్చిన రూ.2,100 కోట్ల నిధులను గ్రామాలకు ఇవ్వకుండా దారి మళ్లించింది అబద్ధమా? 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.500 కోట్లు గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా ఆపింది అబద్ధమా? మాజీ సర్పంచ్‌లు పెండింగ్ బిల్లుల కోసం చలో సచివాలయం పిలుపునిస్తే వారిని పోలీస్ స్టేషన్లలో నిర్బంధించింది అబద్ధమా? పారిశుద్ధ్య లోపంతో సీజనల్ రోగాలు ప్రబలడం అబద్ధమా? రెండు నెలలుగా పారిశుద్ధ్య కార్మికుల జీతాలు, 8 నెలలుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు గౌరవ వేతనం ఇవ్వకపోవడం అబద్ధమా? బీఆర్ఎస్ హయాంలో జీపీలకు నెలనెలా రూ.275 కోట్లు, సంవత్సరానికి రూ.3,300 కోట్ల నిధులు విడుదల చేసింది నిజం కాదా? అని ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలొని గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
జీవో 33 వల్ల స్థానికత కోల్పోతున్న తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకటరెడ్డి గురువారం వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహకు లేఖ రాశారు. ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణలో పుట్టి, పెరిగిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని, 12 ఏండ్లు కష్టపడి చదివి ర్యాంకు సాధించిన విద్యార్థులకు నష్టం జరుగుతుందని వెల్లడించారు. 6 నుంచి 12వ తరగతి వరకు 7 ఏండ్ల కాలంలో గరిష్ఠంగా నాలుగేండ్లు ఎక్కడ చదివితే దానినే స్థానికతగా పరిగణించాలని సూచించారు. స్థానికత విషయంలో రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు.